వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రధాని మోదీ సంఘిభావం తెలిపారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. మొదట ప్రో టీడీపీ చానళ్లు కన్ఫర్మ్ చేస్తూ న్యూస్ వేయగా.., తర్వాత ప్రో వైసీపీగా భావించే కొన్ని చానళ్లు కూడా వార్తను కవర్ చేశాయి. అయితే నిజంగా చేశారా లేదా అన్నదానిపై వైఎస్ఆర్టీపీ వర్గాలు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తనకు సంఘిభావం తెలిపిన మోదీకి కృతజ్ఞతలని.. షర్మిల చెప్పారు కానీ.. అది ఫోన్ ద్వారానా లేకపోతే.. మరో రూపంలోనా అన్నదానిపైనా క్లారిటీ లేదు.
అయితే నేరుగా ప్రధాని మోదీ షర్మిలకు ఫోన్ చేసే అవకాశం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ మోదీ రాజకీయ నిర్ణయాలను అంచనా వేయడం కష్టమని మరికొందరు వాదిస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగిన సమావేశంలో మోదీ, జగన్ మధ్య మాటా మంతీ జరిగినప్పుడు … షర్మిలపై దాడి జరిగినా ఎందుకు స్పందించలేదని జగన్ ను మోదీ అడిగినట్లుగా కొన్ని మీడియాలు రిపోర్ట్ చేశాయి. కానీ అలా అడుగుతారా అన్నదానిపైనా స్పష్టత లేదు. దానికి కొనసాగింపుగా.. ఈ వార్త బయటకు రావడంతో నిజం కాకపోవచ్చన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ను కార్నర్ చేయడానికి షర్మిలకు ఫోన్ చేసి ఉంటారన్న వాదన కొన్ని వర్గాలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా షర్మిలకు మోదీ ఫోన్ చేయడం ద్వారా ఎక్కువగా ఇబ్బంది పడేది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డినే. నర్సంపేటలో షర్మిలపై రాళ్ల దాడి జరిగినప్పుడు కానీ.. తర్వాతి రోజు హైదరాబాద్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే ప్రయత్నం చేసినప్పుడు కానీ జగన్ స్పందించలేదు. తన కోసం చెల్లి ఎంతో చేసినా జగన్ స్పందించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మోదీ కూడా స్పందించారు.. జగన్ స్పందించలేదన్న అభిప్రాయం కల్పించడానికి ఇలాంటివి చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
మొత్తంగా షర్మిలపై ఎటాక్ విషయంలో…, రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలను అంతో ఇంతో ప్రభావితం చేసి.. కీలక నేతల్ని ఇరుకున పెట్టే కార్యక్రమం మాత్రం వ్యూహాత్మకంగా జరుగుతోందని.. తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోందని భావిస్తున్నారు.