ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 11వ తేదీన సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద వివరణ తీసుకోనున్నారు. ఆరో తేదీన అందుబాటులో ఉండనని చెప్పారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని లేఖ రాశారు. కానీ ఆ లేఖకు సీబీఐ నుంచి ఆరో తేదీన సాయంత్రం వరకూ స్పందన రాలేదు. మరో వైపు అధికారులు కూడా రాకపోవడంతో ఈ అంశంపై కవిత న్యాయనిపుణులతో సంప్రందిపులు జరిపారు. అయితే ఆరో తేదీ సాయంత్రానికి సీబీఐ నుంచి రిప్లయ్ వచ్చింది. 11వ తేదీన అందుబాటులో ఉండాలని ఆ రిప్లైలో సీబీఐ అదికారులు కోరారు.
ఆరో తేదీన విచారణకు సహకరించాలని గత వారం కవితకు సీబీఐ అధికారులు లేఖ రాశారు. ఢిల్లీలో లేదా హైదరాబాద్లో అయినా పర్వాలేదన్నారు. ఆ లేఖను స్పందించిన కల్వకుంట్ల కవిత ఆరో తేదీన తన ఇంట్లో అందుబాటులో ఉంటానని సమాధానం ఇచ్చారు. అయితే తర్వాత న్యాయనిపుణులు, తన తండ్రి సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత వ్యూహం మార్చుకున్నారు. తనకు ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశారు. వాటిని సీబీఐ వెబ్ సైట్లో ఉంచినట్లుగా సమాచారం రావడంతో … పరిశీలించి…అందులో నిందితురాలిగా తన పేరు లేదని.. అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని చెప్పారు.
ఇప్పటికైతే సీబీఐ ఇచ్చిన నోటీసు ప్రకారం ఆమెను సాక్షిగానే పిలుస్తున్నారు. ఫిర్యాదులో కానీ.. ఎఫ్ఐఆర్లో కానీ ఆమె పేరు లేదు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను టార్గెట్ చేసి.. తీవ్ర ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసుగా వారు వాదిస్తున్నారు. అందుకే ఆ దిశగానే ఎదుర్కోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఫిర్యాదులో కానీ .. ఎఫ్ఐఆర్లో కానీ కవిత పేరు లేదు. అయితే జరుగుతున్న రాజకీయం మొత్తం కవిత చుట్టూనే తిరుగుతోంది.