ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకూ వెళ్లాలంటే… నిరసనల భయం లేకుండా ఓ చిట్కా కనిపెట్టారు. అదేమిటంటే.. వెళ్లిన ప్రతీ గడపలో ఓ వెండి దేవుడి ప్రతిమ పంచడం. ఆయన అదే్ చేస్తున్నారు. ఒంగోలులో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. పథకాలు రాని వాళ్లు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి కొత్త ఫార్ములా కనిపెట్టారు. దాని ప్రకారం.. ప్రతి ఇంటికి ఓ వెండి ప్రతిమను ఇస్తున్నారు.
బాలినేని దండం పెట్టి ముందుకెళ్తారు.. ఆయన వెనుక వచ్చే మనుషులు.. ఆ ఇంటికి ఇచ్చే పాంప్లెట్తో పాటు ఓ వెండి ప్రతిమ ఇస్తారు. అంతే.. ఎవరైనా నోరు తెరవాలనుకున్న వారు మానేస్తున్నారు. బాలినేని ప్లాన్ చూసి సొంత పార్టీ నేతలే అవాక్కయ్యారు. వెండి ప్రతిమలు అంటే.. చిన్న విషయం కాదని.. బాలినేని తన పర్యటనల్లో నిరసనలు కనిపించకుండా చాలా ఖర్చు చేస్తున్నారని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడే ఇలా వెండి పంచుతున్నారంటే.. ఇక ఎన్నికల సమయంలో బంగారం పంచుతారేమోనని.. ఓటర్లు అంచనాలు పెంచుకుంటే మొదటికే మోసం వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు
అయితే వైసీపీ నేతలు ఇలా గడప గడపకూ వెళ్తూ బహుమతులు పంచడం బాలినేనితోనే ప్రారంభం కాలేదు. కానీ కాస్ట్లీ బహుముతులు ఇవ్వడం మాత్రం ఆయనతోనే ప్రారంభం అయింది. గతంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే సబ్బులు పంచారు.. మరో చోట తినుబండారాలు పంచారు. ఇలాంటివి పంచుతూనే ఉన్నారు. ప్రజలకు తాయిలాలిచ్చి.. నోరు మూయించడం వైసీపీ నేతలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఇలాంటి వాటి వల్లే సెటైర్లు పెడుతున్నాయి.