మధ్య తరగతి జీవికి ఇల్లు ఓ కల. దాన్ని అప్పు చేసైనా నెరవేర్చుకున్నామని సంతోషపడేవారిని ద్రవ్యోల్బణం పేరుతో రోడ్డున పడేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆర్బీఐ వడ్డీ రేట్లను వరుసగా పెంచుకుంటూ పోతోంది. ఫలితంగా ఈఎంఐల భారం పెరిగిపోతోంది. తమ జీతాలను అంచనా వేసుకుని ఈఎంఐలు పెట్టుకుంటారు మధ్య తరగతి ప్రజలు. ఆ అంచనాలను ఆర్బీఐ వడ్డీ రేట్ పెంపుతో తలకిందులు చేసేస్తోంది. ఇల్లు కొనుక్కోని వారు సమీప భవిష్యత్లో కొనుగోలు చేయలేరు. కానీ కొనుక్కున్న వారు మాత్రం నిండా మునిగిపోతున్నారు. ఇళ్లను వదిలించుకునే ఆలోచనలు చేసేలా వడ్డీ రేటు పెంచుతున్నారు.
నాలుగు నెలల కిందటి వరకూ హోమ్ లోన్ల వడ్డీ రేటు ఏడు శాతం వరకూ ఉండేది. ఇప్పుడు అది తొమ్మిదిన్నర శాతం వరకూ ఉంది. రెండేళ్ల కింద ఇల్లు కొనుక్కున్న వారు. ఇరవై ఏళ్ల పరిమితి పెట్టుకుంటే.. ఇప్పుడు అది ముఫ్పై ఏళ్లు దాటిపోయింది. ఈఎంఐలు పెంచుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఎలా చూసినా.. వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయని రిస్క్ తీసుకుని ఇల్లు కొనుక్కున్న ప్రతి ఒక్కరి నెత్తిపైన ఆర్బీఐ బండ వేస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్ల పెంపు ఒక్కటే పరిష్కారమన్నట్లుగా ఆర్బీఐ వ్యవహరించడం మధ్యతరగతి ప్రజలకు మింగుడు పడటం లేదు.
వడ్డీ రేట్ల పెంపు ఇప్పటికే ఆర్థిక మాంద్యానికి దారి తీస్తోంది. అప్పుల లభ్యత తగ్గిపోయి.. డబ్బుల సర్క్యూలేషన్ పడిపోతోంది. దీని వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫలితంగా మాంద్యం చాయలు కనిపిస్తున్నాయి. అలా అయినా పర్వాలేదు కానీ .. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామని అంటున్నారు. నిత్యావసర వస్తువుల పెరుగుదల కారణంగానే ఎక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే దానంతటకు అదే కట్టడి అవుతుంది. కానీ వడ్డీ రేట్ల పెంపునే ఆర్బీ నమ్ముకుంటోంది. హోమ్ లోన్లు తీసుకున్న లక్షల మందిని మళ్లీ రోడ్డున పడేసేందుకే మొగ్గు చూపుతోంది.