షర్మిలను అవమానకరంగా అరెస్ట్ చేస్తే వైసీపీ నుంచి స్పందన లేదు. రాళ్ల దాడి చేస్తే కిక్కురుమనలేదు. కానీ ప్రధాని స్పందించి .. ఫోన్లో పరామర్శించారు. తనకు సంఘిభావం చెప్పిన వాళ్లకు కృతజ్ఞతలు.. చెప్పని వాళ్లకు డబుల్ కృజ్ఞతలని.. షర్మిల నిష్టూరం కూడా ఆడారు. అది జగన్ ను ఉద్దేశించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెల్లి కోసం జగన్ ఎందుకు నోరు విప్పడం లేదనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ నోరు విప్పడం లేదు. దీనికి మోడీ భయం ఉందని అందరికీ తెలుసు. ఏ మాత్రం నోరెత్తిన.. తమ భవిష్యత్ అంధకారమే. జైలు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నెత్తి మీద ఉన్న కేసులు అలాంటిలాంటివి కాదు. అందుకే ఏపీ ప్రయోజనాలు మొత్తం తాకట్టు పెట్టేశారు. రాజకీయ ప్రయోజనాలను మాత్రం అప్పుడప్పుడూ నెరవేర్చుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. మరి కేసీఆర్‌కు వ్యతిరేకంగా .. చెల్లికి అనుకూలంగా మాట్లాడటానికి వచ్చిన సమస్య ఏమిటి ? కేసీఆర్ అన్నా.. భయపడుతున్నారా ? ఆయన తల్చుకున్నా.. కేసులు బయటకు తీస్తారని ఆందోళన చెందుతున్నారా ?
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులన్నీ హైదరాబాద్ కేంద్రంగానే ఉంటాయని అందరికీ తెలుసు. బినామీ ఆస్తుల గురించి ప్రభుత్వానికీ బాగా తెలుసు. చేయాలనుకుంటే. .. వెంటనే పటేస్తుందనే ఆందోళన ఉంటుందన్న అభిప్రాయంఉంది. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించానికి టీఆర్ఎస్ ఎంత సాయం చేసిందో జగన్‌కు తెలుసు. ఈ సారి అది రివర్స్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తట్టుకోవడం కష్టమని జగన్ ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది.
కారణం ఏదైనా..తాను జైలుకు వెళ్లినప్పుడు తన కోసం ఎంతో చేసిన చెల్లి కోసం జగన్.. కనీసం సంఘిభావం చెప్పకపోవడం వల్ల ఆయన క్యారెక్టర్ పై తేడా ముద్ర పడుతోంది. అది జగన్‌కు.. వైసీపీకి మైనస్ అవుతోంది.