రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓ రాష్ట్రం లభించింది. సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కన్నా రెండు, మూడు స్థానాలను ఎక్కువే సాధిస్తోంది. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి 38 వరకూ సీట్లు లభించే అవకాశం ఉంది. ఇక అందరి దృష్టి ఉన్న గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. ఆ పార్టీ ఓటు బ్యాంక్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వరకూ తినేసింది. అయితే గుజరాత్ ఓటర్లు మొత్తం బీజేపీ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపారు.
పోలైన ఓట్లలో 53 శాతానికిపైగా ఓట్లు బీజేపీకే పడ్డాయి. అంటే ప్రజలు చాలా స్పష్టంగా బీజేపీ వైపు మొగ్గు చూపారు. వరుసగా ఏడో సారి బీజేపీ విజయం సాధించిది. గతంలో ఇలాంటి ఫీట్‌ను బెంగాల్‌లో వామపక్షాలు చేసి చూపించాయి. మరోసారి గుజరాత్‌లో బీజేపీకి సాధ్యమయింది. అక్కడ మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 154 బీజేపీకే దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 20మాత్రమే వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పది శాతానికి పైగా ఓట్లు సాధించి.. ఐదు సీట్లను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీకి ఇంత ఏకపక్ష విజయం వస్తుందని చాలా సర్వేలు అంచనా వేయలేకపోయాయి.
ఇక ఉపఎన్నికలు జరిగిన అన్ని చోట్లా బీజేపీకి చుక్కెదురైంది.యూపీ మొయిన్ పురి లోక్‌సభతో పాటు అదే రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ స్థానాలు, ఒడిషా , చత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. యూపీలో ఎస్పీ, లోక్ దళ్, ఒడిషాలో బిజూ జనతాదళ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. మొత్తంగా గుజరాత్‌లో మాత్రం హవా చూపిన కమలం.. మిగిలిన అన్ని చోట్లా ఫెయిలయింది.