విడిపోయిన చిన్న రాష్ట్రం.. పచ్చగా ఉన్న రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య మూడు రాజధానుల పేరుతో చిచ్చు పెట్టి చలి కాచుకుంటున్న వైసీపీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం లేదని సొంత నేతలే చెప్పుకోలేని విధంగా తిడుతూంటే.. వింత వాదనతో తెరపైకి వచ్చింది. సమైక్య రాష్ట్రమే మా విధానమంటూ.. సకలశాఖా మంత్రి సజ్జల తెర ముందుకు వచ్చి ప్రకటించారు. కుదిరితే ఏపీ, తెలంగాణకలుపుతామని.. సమైక్య రాష్ట్రాన్ని వైసీపీ గట్టిగా కోరుకుందని.. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతిస్తామన్నారు. మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా.. మా ప్రభుత్వం, పార్టీ దానికే ఓటు వేస్తుందన్నారు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలను కలిపే అవకాశం ఉందా అని సజ్జల సందేహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు సజ్జల ఈ అసందర్భ సమైక్యవాదం ఎందుకంటే… ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శల నుంచి దృష్టి మళ్లించడం కోసం. బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడకపోతే సీఎం జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని ఘాటుగానే హెచ్చరించారు. తెలంగాణ నుంచి లక్ష కోట్లు రావాల్సి ఉందని.. విభజన హామీలు నెరవేరడం లేదని.. జగన్ అసలు స్పందించడం లేదని మండిపడ్డారు. విభజన అంశాన్ని వదిలేయమని సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ వేసిన అఫిడవిట్‌ను ఉండవల్లి ప్రధానంగా ప్రస్తావించారు.
ఇవి ప్రజల్లోకి బాగా వెళ్లాయి. అందుకే… పోరాడుతున్నామని చెప్పుకునేందుకు తెర ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ రాజీపడబోరని.. పోరాడుతున్నామన్నారు. ఎలా పోరాడుతున్నారో మాత్రం చెప్పుకోలేకపోయారు. పోనీ ఇంత చేసి… ఉండవల్లి చెబుతున్న ఆ ఆఫిడవిట్ విభజన వ్యతిరేకంగా దాఖలు చేసి.. కోర్టు ద్వారా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతారా అంటే అదీ లేదు. అ ఆఫిడవిట్‌తో అయ్యేదీ లేదు.. పొయ్యేదీ లేదని సజ్జల లైట్ తీసుకున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా.. పడుకోబెట్టేసి.. చివరికి అటు తెలంగాణకు భయపడి.. ఇటు కేంద్రానికి భయపడి.. ఏపీ ప్రయోజనాలు మొత్తాన్ని తాకట్టు పెట్టేసిన జగన్ అండ్ కో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం పేరుతో కొత్త నాటకానికి తెర లేపుతున్నారని అనుకోవచ్చు.