తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయిపోయింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. దసరా రోజున టీఆర్ఎస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తూ లేఖ పంపింది. కేసీఆర్ ఈ లేఖను ఆమోదిస్తూ.. శుక్రవారం మధ్యాహ్నం ఖచ్చితమైన ముహుర్త సమయంలో సంతకం చేసి ఈసీకి పంపనున్నారు. ఆ తర్వాత కొత్త బీఆర్ఎస్ జెండా ఎగరేస్తున్నారు. ఇక నుంచి బీఆర్ఎస్ మాత్రమే ఉనికిలో ఉంటుంది. టీఆర్ఎస్ ఉండదు.
తెలంగాణలా ఇండియాను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ . టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణ పార్టీ పేరుతో జాతీయ స్థాయికి వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి నేరుగా పార్టీ పేరునే మార్చేందుకు నిర్ణయించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ వదిలేసుకునే పరిస్థితిని ఊహించలేనిదయినా కేసీఆర్ సాహసోపేతంగా అడుగు ముందుకేశారు. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయాయి. ఇక కేసీఆర్ తన పార్టీతో జాతీయ స్థాయికి వెళ్లడమే మిగిలిదింది.
కేసీఆర్ త్వరలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టి పార్టీ జెండా, అజెండాలను ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ గురించి ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రజలకు ఎలాటి మాటలు చెప్పలేదు. ఎప్పుడు చెబుతారో అన్నదానిపై స్పష్టత లేదు. పేరు మారినా.. తెలంగాణలో మాత్రం కారు గుర్తే కొనసాగనుంది. రంగును కూడా గులాబీ రంగునే కొనసాగిస్తారని చెబుతున్నారు. పార్టీలో సోల్ ఏమీ మారలేదని.. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ పడే ప్రసక్తే ఉండదని.. తెలంగాణలా దేశాన్ని అభివృద్ధి చేయడానికే ఈ ప్రయత్నమని.. బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.