రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకపోతే జగన్ రాజకీయ జీవితానికి పులిస్టాప్ పడినట్లేనని ఉండవల్లి చేసిన కామెంట్లు చాలా రచ్చకు దారి తీశాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి… రెండు రాష్ట్రాలను కలిపేందుకు ఉండవల్లి పిటిషన్ వేశారన్న అర్థం తీసుకుని సమైక్యవాద కామెంట్లు చేశారు. దీనిపై ఉండవల్లి బయట స్పందించలేదు కానీ.. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను రెండు రాష్ట్రాలను కలపమని అడగడం లేదని.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని మాత్రమే అడిగానని ఆయన గత ప్రెస్ మీట్లో చెప్పారు.ఇప్పుడూ కూడా అదే చెప్పారు. విభజన తీరుపై తాను అనుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రియాక్షన్ వచ్చిందన్నారు. సజ్జల వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో అర్థమైందని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక ఎవరు ఏమన్నా తాను పట్టించుకోబోనంటూ స్పష్టంచేశారు. విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని.. దానిపై పోరాడుతూనే ఉంటానంటూ తెలిపారు.
తన వ్యాఖ్యలపై ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారు. అన్యాయంగా విభజించారని వైసీపీ, టీడీపీ రెండు అంటున్నాయి.. తాను దానిపైనే పోరాటం చేస్తున్నానంటూ ఉండవల్లి పేర్కొన్నారు. ఉండవల్లి ఇంటర్యూ పూర్తి వీడియోలో మరికొన్ని కామెంట్లు చేసే అవకాశం ఉంది.