సీబీఐ అధికారులు తొలి రోజు విచారణ ముగించుని వెళ్తూ కవితకు మరో నోటీసు ఇచ్చారు. ధ్వంసం చేసిన ఫోన్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆ నోటీసులో ఉంది. ఇవి ఆ కేసులో సాక్ష్యాల కిందకు వస్తాయి. ఆమె వద్ద ఖచ్చితంగా ఉన్నాయని నిరూపణ చేసుకునే సీబీఐ ఈ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా వాటిని కవిత ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అడిగినవన్నీ ఇచ్చేస్తే.. మరిన్ని చిక్కులు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఒక వేళ ఇవ్వకపోతే.. నిందితురాలిగా మార్చేసి.. సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసు కూడా పెట్టే చాన్స్ ఉంది.
మళ్లీ విచారణ ఎప్పుడు అన్నది సీబీఐ తేదీ ఇవ్వలేదు. త్వరలోనే అని సమాచారం ఇచ్చారు. అయితే ఈ సారి ఇంటికి వచ్చి విచారణ జరిపే అవకాశం లేదని చెబుతున్నారు. ఢిల్లీ వచ్చి హాజరు కావాలని ఆదేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కవిత… ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆ తర్వాత కవిత పేరుతో ఓ స్టేట్ మెంట్ విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విషయం క్లిష్టంగా మారడం.. సీబీఐ మరో నోటీసు ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి రావడంతో .. తన వైపు నుంచి స్టేట్ మెంట్ రిలీజ్ చేయడాన్ని కవిత వాయిదా వేసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కానీ.. ఈడీ కానీ ఆషామాషీగా ఏమీ చేయడం లేదని.. ప్రణాళికాబద్దంగానే చేస్తున్నారన్న అభిప్రాయాలు ఇలాంటి కేసుల్లో పండిపోయిన వారి అభిప్రాయంగా వినిపిస్తోంది. ముందు ముందు కవితకు ఈ కేసులో చిక్కులు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.