వైసీపీలో ఈ సారి టిక్కెట్ల కేటాయింపులో ప్రత్యేకవర్గానికి ప్రాధాన్యత లభించనుంది. ఆ ప్రాధాన్య వర్గానికి విధేయ సర్వీస్ అని పేరు పెట్టుకోవచ్చు. సివిల్ సర్వీస్ అధికారులు వైసీపీకి ఊడిగం చేస్తూ.. ప్రతిపక్ష పార్టీని.. ప్రజల్ని రాచి రంపాన పెడుతున్న వారు .. ముందు జాగ్రత్తగా..ఈ రిటైరైన వెంటనే వెంటనే వైసీపీలో చేరడమో లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆ పార్టీలో చేరి పోటీ చేయడమో చేయాలనుకుంటున్నారు.
ఇప్పటి వరకూ ఐదుగురు సివిల్ సర్వీస్ అధికారులు తమ రాజకీయ జీవితం వైసీపీతో ప్రారంభం అవుతుందని లెక్కలేసుకుంటున్నారు. నియోజకవర్గాలు కూడా ఎంపిక చేసుకున్నారు. వారి కోరికలను ఇప్పుడు వైసీపీ హైకమాండ్ కూడా కాదనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు చేసిన సేవ ఆ స్థాయిలో ఉంది మరి. ప్రభుత్వం మారితే వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే..తాము వైసీపీలో చేరుతామని టిక్కెట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ఇప్పటికే ఓ సీనియర్ ఐపీఎస్ పై ఈ ప్రచారాలు బహిరంగంగానే వచ్చాయి. ఆయన కూడా రాజకీయ నాయకుడిలాగా ప్రకటనలుచేస్తూ ఉంటారు. తన జాతి అభివృద్ధే ముఖ్యమని.. రాజకీయాలు కాదని చెబుతూ ఉంటారు. మిగిలిన నలుగురూ.. తాము ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. అయితే వీరందరూ సిట్టింగ్‌లకే టెండర్ పెట్టబోతున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే.. దాదాపుగా అందరూ రిజర్వుడు నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు.