రాజకీయాన్ని రాజకీయంగా చేయడం చేయకాని వైసీపీ నేతలు… మూర్ఖత్వంతో ఒక్క అంశాన్నే పట్టుకుని తమకు అధికారం ఉంది కాబట్టి.. ఏదైనా చేస్తామన్నట్లుగా వితండ వాదం చేస్తున్నారు. కింది స్థాయి నాయకులు కాదు.. పై స్తాయి వారు కూడా అదే చేస్తున్నారు. దానికి తాజాగా ఉదాహరణ.. పవన్ కల్యాణ్ రాజకీయ పర్యటనల కోసం రూపొందించుకున్న వాహనం వారాహినే. అది ఓ వాహనం.. కానీ దానిపై వైసీపీ నేతలు ముందుగానే యుద్ధం చేస్తున్నారు. అదీ కూడా అర్థం పర్థం లేని యుద్ధం.
ఆ వాహనం కలర్ గురించి రచ్చ చేశారు. కానీ అంతా సాఫీగానే ఉందని.. రిజిస్ట్రేషన్ అయిపోయిందని తెలంగాణ ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే.. తమ వైపు జనం అదోలా చూస్తారని తెలిసి కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్ తెరపైకి వచ్చారు. ఏపీలో తిరగాలంటే.. ఏపీ రూల్స్ పాటించాల్సిందేనని హెచ్చరించారు. రంగులు చూసే విధానం రాష్ట్ర రాష్ట్రానకి మారుతుందేమో అని మంత్రిగారు అనుకుంటున్నట్లుగా ఉన్నారని సెటైర్లు పడుతున్నాయి.
అన్ని నిబంధనలను పరిశీలించి నేషనల్ పర్మిట్ ను ఆ వాహనానికి మంజూరు చేశారు. అలాంటప్పుడు ఏపీలో ఎలా కొత్త రూల్స్ అమలు చేస్తారో స్పష్టత లేదు. కానీ.. వైసీపీ నాయకులు మాత్రం రాజకీయ ప్రతీకారంతో.. వేధింపులకు గురి చేయాలన్న లక్ష్యంతో పవన్ పై అర్థం పర్థం లేని రాజకీయ దాడి చేస్తున్నారు. దాని వల్ల వైసీపీ నేతలకు ఏం వస్తుందో కానీ.. ప్రజలు మాత్రం వైసీపీ రాజకీయంపై అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.