మాండోస్ తుపాను వచ్చింది. పోయింది. పోతూ పోతూ నాలుగు జిల్లాల రైతుల్ని తీవ్రంగా నష్టపరిచింది. ఆ నష్టం కళ్ల ముందు ఉంది. పెద్ద ఎత్తున రైతులు తమ ఆవేదనను చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది ? ఏమీ చేయడంలేదు. ఒక్కరూ చనిపోకపోవడం తమ కృషి ఫలితమేనని చెప్పుకుంటోంది. ఎవరైనా చనిపోతే.. బతికున్న వారంతా తమ కృషి వల్లే బతికారని చెప్పుకుంటుంది. గత మూడున్నరేళ్లుగా జరుగుతోంది ఇదే. విపత్తులొస్తే ప్రభుత్వం ముసుగుతన్ని పడుకుంటుంది. ప్రజలు వాళ్ల సావు వాళ్లు సావాల్సిందే..!
ఏ విపత్తు మీద పడినా.. నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం !
ఏపీలో అత్యధిక తీర ప్రాంతం ఉంది. సహజంగా తుపానుల ముప్పు ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఏ విపత్తు విషయలోనూ ముందస్తు హెచ్చరికలు ఉన్నా అప్రమత్తమయిందే లేదు. చాలా తుపానులు వచ్చాయి… వరదలు వచ్చాయి. కానీ బాధితులు ఎప్పటికప్పుడు నష్టపోతూనే ఉన్నారు.. కానీ ప్రభుత్వం చలించలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి డ్యాములే కొట్టుకుపోయిన దుస్థితి.
రైతులకు కనీస పరిహారమూ కరవు !
అప్పులు తెచ్చి.. ఆరుగాలం శ్రమించి పంటలు వేసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీస్తే… ఆదుకోవడం ప్రభుత్వం కనీస బాధ్యత. ఇలాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఎకరానికి రూ. పదివేల వరకూ ఇచ్చేది. అప్పట్లో జగన్ ఆయా ప్రాంతాలను పరిశీలించి.. సెక్యూరిటీ గార్డును ఒంగోబెట్టి.. ఆయనపై చేయి ఆసరాగా పెట్టుకుని మరీ.. మాట్లాడి.. ప్రభుత్వం రూ. పదివేలేనా ఇచ్చేది.. కనీసం పాతికవేలైనా ఇవ్వాలని ప్రసంగాలు దంచేవారు. ఆయన సీఎం అయ్యారు.. పాతిక వేలు కాదు కదా.. పాతిక పైసలు కూడా ఇవ్వడం లేదు. ఎన్ని తుపానులు వచ్చినా రైతులకు అందిన సాయమే లేదు. చివరికి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి పొలాల్లో ఇసుక మేటలు వస్తే…దాన్ని తీసేందుకూ సాయం చేయలేదు. ఎప్పటికప్పుడు పరిహారం … అంటూ ఇన్ పుట్ సబ్సిటీ కి మీట నొక్కుతూంటారు. దీని ద్వారా నాలుగైదు వందలు రైతులకు అందుతూంటాయి.
కరోనాలో పోయినోళ్లు పోగా… మిగిలిన వాళ్లందర్నీ ప్రభుత్వమే బతికించింది !
కరోనా సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి కథలు కథలుగా చెప్పుకోవచ్చు. తిరుపతిలో ఆక్సీజన్ సరఫరా నిర్లక్ష్యం కారణంగా ఊపిరి వదిలిన ప్రాణాలే దానికి సాక్ష్యం. ఇక వైద్యం అందక.. చనిపోయిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఎన్ని లెక్కలోకి రాని ప్రాణాలు పోయాయో లెక్కలేదు. అంతేనా కరోనా కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా పక్కదారి పట్టించారు. కరోనా బారిన పడిన వారికి మూడు మాస్కులు ఇస్తామని… డిశ్చార్జ్ అవుతున్న వారికి రూ. రెండు వేలు ఇస్తామని.. చనిపోయిన వారికి పదిహేను వేలు ఇస్తామని గొప్పగా ప్రకటనలు చేశారు. ఎవరికీ పైసా ఇవ్వలేదు. చివరికి మూడు మాస్కులు కూడా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వ ప్రచారం మాత్రం.. బతికి ఉన్న వారంతా ప్రభుత్వ కృషి వల్లే బతికారని చెప్పుకోవడం.
ఇటీవల కేరళ ఎంపీ ఒకరు సీఎం సొంత జిల్లా కడపకు వచ్చారు. భారీ తుపాను వస్తూంటే… అధికారులు ఎలా పని చేస్తున్నారో చూద్దామని కడప కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేరు. పోనీ ఫీల్డ్‌లో ఉన్నారేమో అనుకున్నారు. కానీ వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సెకండ్ సాటర్ డే అని ఎవరూ రాలేదట. ప్రభుత్వం కూడా అంతే. అయితే ప్రభుత్వానికి ప్రతీ రోజూ.. సండే..సెకండ్ సాటర్ డేనే. ప్రజలు మాత్రం వాళ్ల సావు వారు సస్తున్నారు.