నిజామాబాద్ జిల్లా బోధన్ లో మూడు నెలల క్రితం ఓ యువకుడు అదృశ్యం అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోవడంలో లైట్ తీసుకున్నారు. పది రోజుల కిందట.. చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో ఓ అస్తిపంజరం బయటపడింది. అక్కడే ఆ యువకుడి బ్యాగ్ ఉంది. దీంతో ఆ యువకుడిదేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ అసలేం జరిగిందన్నది మాత్రం విచారణ చేయడానికి పోలీసులు సిద్ధపడటంలేదు.
రెడ్డి వర్గానికి చెందిన యువతిని ప్రేమించిన శ్రీకాంత్ !
బోధన్‌లో నివాసం ఉండే శ్రీకాంత్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా శ్రీకాంత్‌ను ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు. అమ్మాయి రెడ్డి సామాజికవర్గానికి చెందిన యువతి. దీంతో అమ్మాయి తరఫు బంధువులు… శ్రీకాంత్ ఇంటికి వచ్చి ప్రేమించడం ఆపకపోతే చంపేస్తామని పలుమార్లు బెదిరించారు. అయితే వారి ప్రేమ కొనసాగింది. హఠాత్తుగా శ్రీకాంత్ కనిపించకుండా పోయాడు. శ్రీకాంత్ అదృశ్యం అయిన తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు తెలిపి ఫిర్యాదు కూడా చేశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
80 రోజుల తర్వాత అస్తిపంజరం రూపంలో శ్రీకాంత్ !
శ్రీకాంత్ ఇంటి నుంచి కనిపించకుండా పోయిన 80వ రోజు పసుపు కుంట చెరువు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఉన్న ఓ అస్తి పంజరాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అదృశ్యం అవడంతో.. ఇతడి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. అంతా కలిసి సంఘటనా స్థలానికి చేరుకోగా.. చెట్టుకు అస్తి పంజరం, ఆ పక్కనే శ్రీకాంత్ బ్యాగు ఉన్నాయి. దీంతో అది శ్రీకాంత్ మృతదేహమేనని కుటుంబ సభ్యులు, పోలీసులు భావించారు. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అది ఆత్మహత్య కాదని.. ఖచ్చితంగా హత్యచేసి అక్కడ వేలాడదీశారని.. శ్రీకాంత్ బంధువులు ఉన్నారు.
పోలీసుల ఫోన్ కాల్ వైరల్ !
“అమ్మాయి తరఫు వాళ్లకు ఈ కేసుకు ఏం సంబంధం లేదు. వాళ్లదే తప్పని నువ్వు ఇప్పటికీ భావిస్తూ అది నీ మూర్ఖత్వం. అర్థమైందా. నువ్వోసారి వచ్చి నన్ను కలువు” అని తన సోదరుడి కేసు దర్యాప్తు ఏమయిందని అడిగిన హతుని బందువుపై బోధన్ ఏసీపీ వ్యక్తం చేసిన ఆగ్రహం ఇది. ఈ ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. అసలు విచారణ చేయకుండానే.. ఇలా క్లీన్ చిట్ ఇచ్చేసిన పోలీసుల తీరుపై వారు ఆందోళనలు చేస్తున్నారు. ఈఘటన ఇప్పుడు సంచలనం అవుతోంది.