గత ఐదేళ్లలో కేంద్రం పది లక్షల కోట్లకుపైగా రుణాలను మాఫీ చేసింది. ఇది రైతులకో.. పేదలకో కాదు.. వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టిన బడాబాబులకు. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు ఎగవేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకోలేక బ్యాంకులు రైటాఫ్ చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి మొత్తం ఏటా రెండు లక్షల కోట్లకుపైగా ఉంటోంది.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మొండి బకాయిలను, కేటాయింపులు జరిపిన నిరర్థక రుణాలను నాలుగేండ్ల తర్వాత బ్యాంకులు వాటి ఖాతాపుస్తకాల్లోంచి రైటాఫ్ చేస్తాయి. తద్వారా బ్యాంకులు పన్ను ప్రయోజనాలు పొందుతాయి. రుణాలు రైటాఫ్ జరిగినా, సంబంధిత రుణగ్రస్తులు రుణాలు చెల్లించాల్సిందేనని, రికవరీ ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని చెబుతున్నారు. కానీ ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి.
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ దేశంలోని బ్యాంకులు రూ.14.38 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రైటాఫ్ చేశాయి. ఇందులో దాదాపు 70 శాతం ప్రభుత్వరంగ బ్యాంకులు చేసినవే. బ్యాంకుల నుంచి తమ అనుయాయులకు రుణాలు ఇప్పించడం, అనంతరం వాటిని ఎన్పీఏలుగా మార్చి రైటాఫ్‌లు చేయించడం.. తర్వాత నెపాన్ని బ్యాంకు అధికారులపైకి నెట్టేయడం పరిపాటిగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.