సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా అనధికారికంగా ఎలా పెత్తనం చెలాయిస్తున్నారో… ఎవరూ ఊహించని ఐడియాలు సీఎం జగన్ కు ఎలా ఇస్తున్నారో అప్పుడప్పుడూ ఆయన తమ వైఫల్యాలపై చేసుకునే కవర్ డ్రైవ్ ల ద్వారా బయటపడుతూనే ఉంటుంది. తాజాగా ఉద్యోగుల జీతాలు సగం నెల దాటిపోయినా సగం మందికి రాకపోవడంపై విచిత్రమైన కారణం చెప్పారు. అందరికీ ఒకే సారి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జీతాలు ఇవ్వడం ఆలస్యమవుతోందని చెబుతున్నారు.
సజ్జల చెప్పిన కారణం విని అక్కడి జర్నలిస్టులు మనసులో నవ్వుకున్నారు కానీ.. బయటకు ఎవరూ ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు. టీవీల్లో చూసిన ఉద్యోగులకు మాత్రం ఏం చెప్పాడో మాత్రం అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. గత ప్రభుత్వంలో పర్మినెంట్ ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీ కల్లా ఇచ్చేవారట.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లేటుగా ఇచ్చేవారట. తమ ప్రబుత్వంలో అందరికీ ఒకే సారి ఇవ్వాలన్న కారణంగా లేటవుతోందట.
అందరికీ ఇవ్వాలనుకుంటే ఒకటో తేదీనే ఇవ్వొచ్చు కదా అని సామాన్యులకు డౌట్. అయినా ఇప్పుడు.. జీతాలు ఇరవయ్యో తేదీ వరకూ పడుతూనే ఉన్నాయి. ఎవరి అకౌంట్లో ఎప్పుడు పడతయో చెప్పడం కష్టం. అదేదో ఆలస్యం చేసి అందరికీ ఒకే సారి ఇస్తున్నట్లుగా సజ్జల చెప్పుకున్నారు. ఉద్యోగులు, ప్రజలు.. అందరూ తాము ఏది చెబితే అది నమ్మేసి… బాంచన్ అని వెళ్లిపోతారని.. సజ్జల గట్టి నమ్మకంతో ఉన్నారని ఆయన తరచూ చెప్పే మాటల్ని బట్టి అర్థం అవుతూ ఉంటుంది… కానీ మరీ ఇంత తక్కువగా అంచనా వేస్తారని మాత్రం ఎవరూ అనుకోలేరు.