ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపుల కోసం ఎంత కసితో ఉన్నారో మరోసారి స్పష్టమయింది. అయ్యన్నపాత్రుడు తన ఇంటి వెనుక పదిగజాల స్థలం ఆక్రమించాడని కేసులు పెట్టడమే కాదు.. దానిపై ఇచ్చిన ఎన్వోసీల మీద తప్పుడు కేసుల మీద కేసులు పెట్టి.. హైకోర్టులో ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ.. చివరికి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడా తప్పు పట్టించుకున్నారు. అయితే సాధారణ న్యాయపరిజ్ఞానం.. ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న వారందరికీ అది తప్పుడు కేసు అని స్పష్టంగా తెలుసు . ఈ తప్పుడు కేసునే సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ప్రభుత్వం ఏం చేయాలనుకుందో కానీ.. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.
అయ్యన్న పాత్రుడు కేసుపై దర్యాప్తునకు కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దర్యాప్తు కూడా చేయవద్దని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి సీనియర్ లాయర్‌కు చెల్లించుకున్న రూ. లక్షల ఖర్చు మాత్రమే మిలిగింది. ఇంత ఖర్చు చేసి.. అయ్యన్నపాత్రుడుకి ఊరట ఇచ్చినట్లయింది. అసలు ఇలాంటి కేసుల్లో ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్తారా అని.. విచారణ జరిగిన తర్వాత అందరికీ వచ్చే డౌట్. కానీ ఈ ప్రభుత్వం వెళ్తుందని సరి పెట్టుకోవడమే. కక్ష సాధింపులే ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా మారిపోయిన వైనం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకూ ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక.., టీడీపీ నేతల్ని వేధించని రోజు లేదు. కేసులు పెట్టారు.. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రుళ్లు అరెస్టులు చేశారు. కొంత మందిని కొట్టారు. ఇలాప్రభుత్వ పెద్దలు టీడీపీ నేతల్ని వర్గ శత్రువులుగా ఎందుకు చూస్తున్నారో కానీ.. అదో రకమైన మానసిక దుర్భర పరిస్థితిగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. తప్పుడు కేసులతో ఏమీ చేయలేరని.. అంతకు అంత బదులు చెల్లిస్తామని టీడీపీ నేతలు తరచూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.