పవన్ కల్యాణ్ అంటే చాలు వ్యక్తిగత దూషణలతో ముందు ఉండే వైసీపీ నేతల్లో ఒకరు అంబటి రాంబాబు. పవన్ కల్యాణ్ ఆయనపై నోరు చేసుకోవడం కన్నా.. రాజకీయంగా చెక్ పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ రోజు పర్యటించబోతున్నారు. ఈ ఆదివారం కౌలు రైతు భరోసా యాత్రను సత్తెనపల్లిలోనే ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా 280 మంది ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నారు.
పవన్ కల్యాణ్.. సత్తెనపల్లిపై దృష్టి సారించడానికి ప్రత్యేక కారణం ఉంది. సత్తెనపల్లిలో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. ఆ కారణంగానే రేపల్లెకు చెందిన అంబటి రాంబాబుకు .. జగన్ అక్కడ రెండు సార్లు టిక్కెట్ ఇచ్చారు. అయితే ఈ సారి పరిస్థితి తేడాగా ఉండటంతో ఆయనను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. మార్చినా మార్చకపోయినా .. అంబటి రాంబాబు విషయంలో పవన్ కల్యాణ్ సీరియస్‌గా ఉండటంతో.. ఎక్కడ పోటీ చేసినా ఓడించాలన్న లక్ష్యంతో ఉన్నారు. అందుకే .. జిల్లా స్థాయిలో చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమానికి సత్తెనపల్లినే వేదికగా చేసుకున్నారు.
పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడే మరో మంత్రి జోగి రమేష్ విషయంలోనూ… జనసేన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల జోగిరమేష్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పవన్ తో సమావేశమయ్యారు. జోగి రమేష్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తాను వస్తానని.. భరోసా ఇస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు. దీంతో త్వరలోనే పెడన నియోజకవర్గంలో పర్యటించే అవకాశం ఉంది.