మొత్తానికి తెలంగాణ శాసనసభలో కత్తులు పదునెక్కబోతున్నాయి. అయితే ఇవేమీ రాజకీయ విమర్శలు కత్తులు మాత్రం కాదు. పాలకపక్షం వైఫల్యాల మీద ప్రయోగించడానికి విపక్షాలు నూరుతున్న కత్తులు అనుకుంటే పొరబాటు. పదునెక్కుతున్నదెల్లా క్రమశిక్షణ కత్తులు. శాసనసభలో సభ్యులు క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలనే విషయంలో కొత్త సిఫారసులను తయారుచేస్తున్నారు. గవర్నరు ప్రసంగానికి అడ్డు తగిలితే ఏడాది పాటు సస్పెన్షన్ చేయడం అనే కొత్త నిబంధనను విధించబోతున్నారు.
నిజానికి తెలంగాణ ప్రభుత్వానికి శాసనసభలో ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే.. పేరుకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది గానీ.. ఆ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ఒక మాట అనగలిగిన వారు ఒకరిద్దరు మాత్రమే. మిగిలిన వారు పరిస్థితులు ఎప్పుడు ఎలా పరిణమిస్తాయో అని జాగ్రత్త పడేవారిలాగా కనిపిస్తుంటారు. విపక్షాల విమర్శల పరంగా వారికి ఇబ్బంది లేకపోయినా.. క్రమశిక్షణ కత్తులకు పదునెక్కువ చేసి.. సభ్యుల మీద దూయడానికి ప్రభుత్వం ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది.
ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ క్రమశిక్షణ కమిటీ.. దీనికి సంబంధించి కఠినమైన కొత్త నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సభ్యులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలితే గనుక.. వారి మీద అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించనున్నది.
అయితే ఇక్కడ తమాషా ఏంటంటే.. కేవలం… గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డగోలుగా అడ్డుకోవడం, ఆయన ప్రసంగపాఠపు ప్రతులను చించి పారేయడం.. ఏకంగా గవర్నరు మీద దాడికి ప్రయత్నించడం వంటి అనేకానేక దుందుడుకు చర్యలకు పాల్పడడం అనేది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న రోజుల్లో తెరాస సభ్యులంతా గందరగోళం చేశారు. గవర్నరు ప్రసంగానికి అడ్డుపడడం అనేది తమ హక్కుగా భావించడం అనేది తెరాస ఇటీవలి కాలంలో నిరూపించిన సంస్కృతి. నిరసనలకు అది పరమోత్తమ మార్గం అని అంతా ఫీలయ్యారు. అయితే అదే తెరాస సర్కారు ఇప్పుడు అదే విషయంలో సభ్యులు ఎవరైనా గవర్నరు ప్రసంగానికి అడ్డు పడితే ఏడాది పాటు సస్పెన్షన్ విధించేలా నిర్ణయం తీసుకుంటున్నారు.