ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండనుకుటున్నారని బ్రదర్ అనిల్ అనేశారు. స్వార్థం కోసం ఇచ్చే పథకాలపై ఆధారపడవద్దని ఆయన హితవు కూడా చెబుతున్నారు. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొనేందుకు బ్రదర్ అనిల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీకి వచ్చారు. విశాఖలో ఓ వేడుకలో పాల్గొని ప్రార్థనా ప్రసంగం చేశారు. ఆయన చేసింది ప్రార్థనా ప్రసంగమే.. కానీ అందులో రాజకీయాన్ని ఇమిడ్చేశారు. జగన్ పాలనపై పరోక్ష విమర్శలు గుప్పించారు.
ఎక్కడా జగన్ పేరు ఎత్తలేదు.. కానీ ప్రభుత్వం .. ప్రభుత్వం అంటూ.. తన ఉద్దేశం చెప్పకనే చెప్పారు. ఏపీలో పాలన దారుణంగా ఉందని.. ప్రజల బతుకులు దుర్భరం అయ్యాయని.. అందుకే ఇతర రాష్ట్రాల్లో పుట్టి ఉండినా బాగుండనుకుంటున్నారని .. అనిల్ చెబుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే డబ్బులు ఇస్తూ.. జీవితాల్ని నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరునూ ఆయన ఎండగట్టారు. బ్రదర్ అనిల్ మాటలు క్రైస్తవుల్లో ఆలోచన రేకెత్తిస్తే.. జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమేనని అనుకోవచ్చు.
బ్రదర్ అనిల్ ఇదే మొదటిసారి కాదు. గతంలో పార్టీ పెట్టేందుకు సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన ప్రకటనలు చేశారు. తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు. కానీ.. ఆయన దృష్టిలో ఏపీ లో రాజకీయం ఉందని తాజా మాటలతో తేలిపోయింది. జగన్ తో .. షర్మిలకు వివాదాలు ఉన్నాయనేది బహిరంగరహస్యం. ఈ వివాదాల్లో జగన్ తీరు .. బ్రదర్ అనిల్ కూ నచ్చలేదని.. స్పష్టమవుతోంది.. క్రిస్మస్ లోపు బ్రదర్ అనిల్ ఎన్ని నియోజకవర్గాల్లో తిరిగితే.. అన్ని సార్లు జగన్ ను ఇబ్బంది పెట్టే కామెంట్లు చేసే అవకాశం ఉంది.