తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఉత్తరాదిన కూడా విస్తరించాలనుకుంటున్నారు. దక్షిణాదిలో ఏపీలో చాలా చాన్సులు ఉన్నాయని ఆయన భావిస్తుననారు. అందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బాధ్యతలిచ్చారు. అక్కడ ఆయనకు ఉన్న బంధుత్వాల కారణంగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఏపీ సమస్యల పట్ల ఇప్పుడు ఏదో విధంగా ప్రతిస్పందించకపోతే.. అనుకున్నంత ఎఫెక్ట్ రాదు. ఏపీలో ఇప్పుడు ప్రధానమైన సమస్య.. .అమరావతి లేదా మూడు రాజధానులు. ఈ అంశంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు కేటీఆర్ గతంలో మద్దతు పలికారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ ఏపీలోనూ రాజకీయం చేయబోతోంది. ఇలాంటి సమయంలో అదే విధానానికి కట్టుబడి ఉన్నారా లేకపోతే.. అమరావతికి మద్దతు ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు.. ప్రజాసంఘాలు.. అమరావతికే మద్దతు ప్రకటించాయి. బీజేపీ, కాంగ్రెస్ కూడా అమరావతికే మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానులంటోంది. ఇప్పుడు వైసీపీ వైపు కేసీఆర్ ఉంటారా లేకపోతే.. అమరావతి వైపా అన్నది తేల్చుకుంటే.. పార్టీ విస్తరణకు మార్గం సుగమం చేసుకున్నట్లే.
కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. అమరావతి రైతులు కూడా ధర్నా చేయడానికి ఢిల్లీ చేరుకుంటున్నారు. శనివారం వారు జంతర్ మంతర్లో ధర్నా చేయనున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ హాజరై మద్దతు పలికితే.. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి ఓ ప్రాతిపతిక ఉన్నట్లవుతుంది. ఎందుకంటే ఇటీవలే తమ ఏపీ బీఆర్ఎస్ ఆఫీసు విజయవాడలోనే ఉంటుందని చెబుతున్నారు. ఓ రకంగా అది సంకేతం అనుకోవచ్చు. ఒక వేళ ఢిల్లీలోనే ఉండి.. ఏపీ రైతులు.. ఓ సమస్యపై వచ్చి అక్కడే పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోతే.. కేసీఆర్ జాతీయ నాయకుడిగా తొలి అడుగుల్లోనే తడబడుతున్నట్లుగా అనుకోవచ్చు.