ఎంత చెప్పినా కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పని తీరు మార్చుకోవడం లేదని సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సమీక్ష చేశారు. దీనికి అందరు ఎమ్మెల్యేలు.. ఇంచార్జులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. మొత్తం 32 మంది పని తీరు బాగో లేదని జగన్ మొహం మీదనే చెప్పారు.వారి పేర్లు కూడా వినించారు. వారిలో విడదల రజని, గుడివాడ అమర్నాథ్ వంటి మంత్రులు కూడా ఉన్నారు. ఎన్ని సార్లు చెప్పినా.. మారడం లేదని.. అలా అయితే కష్టమని వారికి జగన్ హెచ్చరించారు.
మళ్లీ మార్చి నెలలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తామని.. ఈ వంద రోజులు మనకు ఎంతో కీలకమని జగన్ చెప్పుకొచ్చారు. అప్పటికల్లా సర్వే రిపోర్టులు వస్తాయని.. అప్పుడే అభ్యర్థుల్ని ఖరారు చేస్తానన్నారు. పని తీరు బాగోలేని ఎమ్మెల్యేలు.. సర్వేల్లో సరిగ్గా ఫలితం పొందని వారిని పక్కన పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడబోనని జగన్ స్పష్టం చేశారు. ఏప్రిల్లో సర్వే రిపోర్టులు వచ్చిన తర్వాత అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తానని జగన్ చెప్పారు.
అయితే ఇలా గడప గడపకూ కార్యక్రమంలో వెనుకబడిన మంత్రులు.. పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా ఇతర పనులు అప్పగించడంతోనే వారు సరిగ్గా వెళ్లలేకపోతున్నామని.. ఇది తెలిసి కూడా తమను అవమానించేలా… బహిరంగంగా పేర్లు చదివడం ఏమిటన్న వాదన ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కొంత మంది నేతలు నిజంగానే నిరాసక్తంగా ఉన్నారు. టిక్కెట్ ఇస్తే సరి లేకపోతే లేదని గడప గడపకూ కార్యక్రమాన్ని లైట్ తీసుకుంటున్నారు.
మొత్తంగా పీకే టీమే.. ఎమ్మెల్యేల పనితీరును మార్క్ చేస్తోంది. దీనిపైనా వైసీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే జగన్ తమ పార్టీ నేతల కన్నా పీకే టీం రిపోర్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.