మాచర్లలో వైసీపీ, టీడీపీ నేతలు చేసుకున్న దాడులతో పల్నాడు అంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉంది. పోలీసులు ఎవరినీ అటు వైపు వెళ్లనీయడం లేదు. మాచర్ల అనే కాదు.. పల్నాడు మొత్తం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కౌలు రైతు భరోసా యాత్ర కోసం సత్తెనపల్లి వెళ్లనున్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న 280 మంది కౌలు రైతుల కుటుంబాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి.
అయితే పల్నాడులో పరిస్థితుల్ని చూపించి.. పవన్ కల్యాణ్‌ను సత్తెనపల్లి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రభుత్వంపై ఇవే ఆరోపణలు చేశారు. పల్నాడులో ఉద్రిక్తల పేరు చెప్పి జనసేన నేతల్ని బెదిరిస్తున్నారని.. సత్తెనపల్లికి ఎవర్నీ రాకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. కార్లు, జీపుల్ని అనుమతించేది లేదని చెబుతున్నారని మండిపడుతున్నారు. పోలీసులు పవన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం మంచి పద్దతి కాదన్నారు. రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నది పల్నాడు ప్రాంతంలోనే కాబట్టి..తాము సత్తెనపల్లిలో ప్రోగ్రాం పెట్టామని అంటున్నారు.
పవన్ కల్యాణ్ మామూలుగా కౌలు రైతు భరోసా చెక్కులను పంపిణీ చేయడానికి ఓ రూట్ మ్యాప్ ఖరారు చేసుకుని .. కొంత మంది రైతుల ఇళ్లకు వెళ్లి పరామర్శించేవారు. అయితే ఈ సారి నేరుగా సత్తెనపల్లిలోనే కార్యక్రమం పెట్టారు. మాచర్లలో ఘర్షణలు జరగకముందే ఈ కార్యక్రమం ఖరారైంది.ఇప్పుడు పవన్ ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. ఏపీ రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయి.