ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో కీలకంగా వ్యవహరంచి బీజేపీని ఇరుకున పెట్టిన పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడంపై సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన శనివారం పైలట్ రోహిత్ రెడ్డికి సమయం ఇచ్చారు. ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి… బండి సంజయ్‌కు సవాల్ చేసిన ఆయన తర్వాత నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈడీ తనకు జారీ చేసిన నోటీసుల్ని కేసీఆర్ కు చూపించారు. ప్రగతి భవన్ నుంచే ఆ నోటీసుల విషయంలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.
ఈడీ ఇచ్చిన నోటీసుల్లో ఎక్కడా ఫలానా కేసు అని లేకపోవడంతో పాటు.. అన్ని ఆస్తుల వివరాలు… కంపెనీల బ్యాలెన్స్ షీట్లు.. ఐటీ రిటర్నులు తీసుకు రావాలని అడిగారని.. అంటున్నారు. తాము ఇచ్చిన వివరాల్లో ఏమైనా లోపం ఉంటే..వాటితోనే తమపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలను పైలట్ వర్గం వ్యక్తీకరిస్తోంది. అందుకే న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకుని .. ఈడీ విచారణకు వెళ్లాలా వద్దా అన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
ఈడీ జారీ చేసిన నోటీసులు చట్ట పరంగా లేనందున కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే ఎలా ఉంటుందన్న దానిపైనా రోహిత్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారు. అయితే రోహిత్ రెడ్డికి ఎంతో సమయం లేదు. 19వ తేదీనే ఆయన హాజరు కావాల్సి ఉంది. ఆదివారంకోర్టులు పని చేయవు. సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆ రోజున డుమ్మా కొట్టి కోర్టుకెళ్తే ఎలా ఉంటుందనేది న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అసలు నోటీసులు ఇచ్చింది హైదరాబాద్ డ్రగ్స్ కేసా.. కర్ణాటక డ్రగ్స్ కేసా అన్నదానిపై స్పష్టత లేదు. కర్ణఆటక డ్రగ్స్ కేసుపై ఇంత వరకూ ఈడీ కేసు నమోదు చేయలేదు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మాత్రం ఈడీ విచారణ జరుపుతోంది.