చిరంజీవిలో ఓ గొప్ప లక్షణం ఉంది. ఎవరైనా నచ్చితే, ప్రతిభ ఉందని తెలిస్తే… టక్కున అక్కున చేర్చుకొంటారు. వాళ్లని వీలైనంత వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు చిరు దృష్టి లక్ష్మీ భూపాలపై పడింది. తెలుగులో ఉన్న అతి కొద్ది మంది మంచి రచయితల్లో లక్ష్మీ భూపాల ఒకరు. అలా మొదలైంది, చందమామ, నేనే రాజు నేనే మంత్రి, ఓబేబీ సినిమాతో తనదైన మార్క్ వేసుకొన్నారు లక్ష్మీ భూపాల. ఇటీవల గాడ్ ఫాదర్ కి మాటలు అందించారు. అందులో లక్ష్మీ భూపాల మాటలు, తన పనితీరు చిరుకి బాగా నచ్చాయి. తాజాగా కృష్ణవంశీ ‘రంగమార్తండ’ కోసం ఓ షెహరీ రాశారు భూపాల. ఈ షెహరీని చిరంజీవి స్వయంగా ఆలపించడం విశేషం.
‘రంగమార్తండ’ ప్రమోషన్లలో భాగంగా ఈ షెహరీని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరుతో కృష్ణవంశీ ఓ చిట్ చాట్ కూడా చేశారు. అది కూడా ఈ షెహరీతో పాటు విడుదల అవుతోంది. ఓ తెలుగు సినిమాలో హెహరీని వినిపించడం బహుశా ఇదే తొలిసారేమో..? ఓ నటుడి జీవితాన్ని 360 డిగ్రీలలో ఆవిష్కరించిన హెషరీ ఇది. అందులోని పదాలు, భావ వ్యక్తీకరణ.. చిరంజీవికి బాగా నచ్చాయి. అందుకే.. ఆ షెహరీ చదువుతున్నప్పుడు చిరు పులకరించిపోయార్ట. ”ఇది లక్ష్మీ భూపాల రాశాడని అనుకోలేదు. తరవాత తన పేరు వినేసరికి ఆశ్చర్యపోయాను. చాలా గొప్పగా రాశాడు.. నా జీవితాన్ని నేను ఆవిష్కరించుకొన్నట్టు అనిపించింది” అంటూ భూపాలకు కాంప్లిమెంట్ ఇచ్చారు చిరు. కృష్ణవంశీ కూడా ”తను మనసున్న కవి. అందుకే అంత గొప్పగా రాశాడు” అని కితాబు అందించారు. మరి ఈ షెహరీ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాలి.