హైదరాబాద్: పోయినవారు పోగా మిగిలి ఉన్న ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. 47 మంది ఎమ్మెల్యేలు హాజరవగా, ఏడుగురు గైర్హాజరయ్యారు. ఇవాళ ఉదయం లోటస్ పాండ్‌లో ఈ సమావేశం జరిగింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఫిరాయింపు అంశం, బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహం, స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం, విభజన చట్టంలోని హామీలను సాధించటంలో ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఫిరాయింపులపై మాట్లాడుతూ, ఉన్నవాళ్ళే మనవాళ్ళని జగన్ అన్నట్లు తెలుస్తోంది.
భేటీ అనంతరం నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ, జగన్ బీ ఫారం ఇవ్వటంవల్లే ఎమ్మెల్యేలుగా గెలిచామని, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నీచులం కాదని అన్నారు. టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఆ పార్టీ గుర్తుపై గెలవాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దని, సత్యహరిశ్చంద్రుడిలా నీతులు చెప్పటం మానుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.
గైర్హాజరైన ఏడుగురిలో పొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు సుచరిత, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, తిప్పేస్వామి, గౌతమ్ రెడ్డి, మణిగాంధి ఉన్నారు. అయితే వీరందరూ జంప్ చేస్తారని కాదని, వీరిలో కొందరు వ్యక్తిగత కారణాలవల్ల రాలేకపోతున్నామని జగన్‌కు ఫోన్ చేశారని తెలుస్తోంది. కడప జిల్లా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏడుగురు ఎమ్మెల్యేల గైర్హాజరుపై స్పందిస్తూ, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారని, వ్యక్తిగత కారణాలవల్ల హాజరుకాని ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేయొద్దని మీడియా ప్రతినిధులను కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి వెళ్ళుంటే బాగుండేదన్నారు.