తెలంగాణ సీనియర్లకు ఇప్పుడు పార్టీ మారడానికి రేవంత్ అనే అస్త్రం.. అప్పనంగా కనిపిస్తోంది.ఇంత కాలం కాంగ్రెస్‌లో ఉండి అన్నీ అనుభవించేసి పార్టీ మారుతారా అని వస్తున్న విమర్శలకు రేవంత్‌ను బూచిగా చూపి పార్టీ మారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌ను మార్చలేదని.. ఆయన కింద పని చేయడానికి ఇష్టం లేదని.. కాంగ్రెస్ అంటే.. ప్రాణం అని చెప్పి ఈ నేతలంతా.. ఎన్నికల్లోపుగానే.. బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అనుమానం కాంగ్రెస్‌లో వినిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీల్లో యాభై శాతానికిపైగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లేనని ఉత్తమ్ చెప్పాడు. నిజానికి కాంగ్రెస్ ప్రకటించిన కమిటీల్లో పదవులు పొందిన మొత్తం 196 మందిలో కేవలం 12 మంది మాత్రమే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు. వారు కూడా గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పని చేస్తున్నవారే. దీన్ని కాంగ్రెస్ లోని ఇతర నేతలే హైలెట్ చేస్తున్నారు. సీనియర్లు ఉ్దదేశపూర్వకంగా పార్టీని బద్నాం చేస్తున్నారని.. వారి లక్ష్యం పార్టీపై వలస ముద్ర వేసి.. ఇతర పార్టీల్లో చేరడమేనని అంటున్నారు.
ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉండగా టీఆర్ఎస్ బీ టీమ్‌లా పని చేసిందనేది ఎక్కువ మంది ఆరోపణ. అనేక ఓటముల తర్వాతే పీసీసీ చీఫ్ పదవి నుంచి ఆయన వైదొలిగితేనే హైకమాండ్ రేవంత్ కు పదవి ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నా..రెండు ఎన్నికల్లో కనీస మాత్రం సీట్లు తెచ్చుకోలేకపోయారు. తెచ్చుకున్న కొన్ని నిలుపుకోలేకపోయారు. వరుస ఓటములతో ఉన్న పార్టీలో పీసీసీ చీఫ్ గా రేవంత్ ను నియమించాక కాస్త ఊపు వచ్చింది. అయితే సీనియర్ నేతలంతా కలిసి దాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్లుగా సులువుగానే అర్థం చేసుకోవచ్చు.