తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటే .. అనే ఆలోచన చాలా మంది వైసీపీ నేతల్లో రెండో ఆలోచనకు కారణం అవుతోంది. ఓ వైపు వైసీపీలో పెరిగిపోయిన ఆధిపత్య పోరాటం.. మరో వైపు పెరిగిపోతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఇలాంటివన్నీ అంచనా వేసుకుని నాయకులు.. ఏడాదిన్నర ముందే సేఫ్ జోన్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కోస్తా, ఉత్తరాంధ్ర నుంచి జనసేనలోకి వైసీపీ నేతలు ఎక్కువగా చేరుతున్నారు. ప్రభుత్వం నుంచి వేధింపులు ఉంటాయని తెలిసి కూడా ఇప్పుడే చేరికలు ఉండటం రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది.
రాజోలు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరారు. రాజోలు నియోజకవర్గం.. జనసేన గెలచిన ఏకైక నియోజకవర్గం. కానీ అక్కడి ఎమ్మెల్యే జగన్ కు జై కొట్టారు. దీంతో బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి గురాన అయ్యలు అనే మరో నేత కూడా చేరారు. ఈయన పారిశ్రామికవేత్త. పీఆర్పీలో పని చేసి.. ఇటీవలి వరకూ వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు జనసేనలో చేరారు. పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరు కొండలరావు కూడా జనసేనలో చేరారు. ఈయన పదవిలో ఉండగానే జనసేనలో చేరడం విశేషం.
ఉత్తరాంధ్ర, కోస్తాల నుంచి కొంతమంది కీలక నేతలు… ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు జంప్ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందుగా అనుచరుల్ని పంపి.. సీటు కోసం కర్చీఫ్ వేసుకోవడం వంటివి చేస్తున్నారు. ప్రభుత్వం దారుణమైన వేధింపులకు పాల్పడే చాన్స్ ఉన్నందున కొంత మంది గుంభనంగా వ్యవహరిస్తున్నారు.