రేవంత్ రెడ్డికి కీడు చేద్దామనుకున్నారో.. కాంగ్రెస్ పార్టీ అంటే మాది.. ఆయనెవరు అని హైకమాండ్‌కు సందేశం పంపాలనుకున్నారో కానీ… సీనియర్లు చేసిన రాజకీయం మాత్రం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పార్టీ కంప్లీట్‌గా రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్లింది. టీ పీసీసీ కమిటీలను ఏర్పాటు చేసిన హైకమాండ్ వాటి సమావేశాలనూ నిర్వహించాని ఆదేశించింది. రేవంత్ రెడ్డి నిర్వహించారు. అందరూ వచ్చారు కానీ.. సీనియర్లుగా కొత్త కుంపటి పెట్టుకున్న 9 మంది మాత్రమే హాజరు కాలేదు. దీంతో వారు తప్ప..మిగతా పార్టీ అంతా ఏకతాటిపైకి ఉన్నట్లు తేలింది.అంతే కాదు.. ఆ పార్టీ అంతా రేవంత్ వైపు ఉన్నట్లుగా స్పష్టమయింది.
9 మంది సీనియర్లు ఉద్దేశపూర్వకంగా పూర్తి స్థాయిలో కుట్ర పూరితంగా కాంగ్రెస్‌పై టీడీపీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని హైకమాండ్‌కు ఇప్పటికే నేతలు నివేదిక పంపారు. కమిటీల్లో కనీసం 13 మంది కూడా టీడీపీ నుంచి వచ్చిన వారు లేకపోయినా సగం మందికిపైగా ఉన్నారని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని వారు వీడియోలను హైకమాండ్‌కు పంపారు. ఇక కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రకటించారు. పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఆయన పాదయాత్రకు తిరుగులేదని తేలిపోయింది.
ఇక కార్యవర్గ సమావేశాలకే హాజరు కాలేదంటే.. ఇక కాంగ్రెస్ పార్టీలో.. సీనియర్ల పరిస్థితి ఉన్నా లేనట్లేనని భావిస్తున్నారు. వారిని ఇక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ప్రోత్సహించదని.. కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసి బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్న సమయంలోనే.. రాజగోపాల్ రెడ్డి.. మరింత ముందుకెళ్లి అందరూ బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు.
ఎలా చూసినా కాంగ్రెస్ సీనియర్ల వ్యవహారం.. రేవంత్ రెడ్డికి ప్లస్ గా మారింది. ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి.. లేకపోతే బయటకు వెళ్లిపోవాలన్న పరిస్థితిని వాళ్లే తెచ్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై పూర్తి స్థాయి పట్టు లభించినట్లయింది.