సీఎం జగన్ బాపట్ల పర్యటనకు వెళ్తున్నారు. బైజూస్ కు దాదాపుగా రూ. వెయ్యి కోట్ల వరకూ చెల్లించి కొన్న ట్యాబ్లను విద్యార్థులకు పంచే కార్యక్రమాన్ని 21వ తేదీన అక్కడే ప్రారంభించనున్నారు. దీని కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు సీఎంవో ఆదేశించింది. ఆదేశాలు ఖర్చు లేకుండా ఇవ్వొచ్చు.. కానీ ఏర్పాట్లు చేయాలంటే మాత్రం ఖర్చులు భరించాలి. చేసేయండి బాస్.. అని కాంట్రాక్టర్లకు చెబితే.. జీ హూజూర్ అని చేసేవారు ఇప్పుడు లేరు. ముందు డబ్బులిస్తేనే చేస్తామంటున్నారు.
దీంతో అధికారులు.. ముందస్తు నిధుల సమీకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. ముందుగా జిల్లాలో ప్రభుత్వ శాఖల ఖాతాల్లో ఏమైనా డబ్బులున్నాయో లేదో చూశారు. పైసా కూడా కనిపించలేదు. దీంతో మండలాలు, గ్రామాల వారీగా సమీకరణ ప్రారంభించారు. జిల్లా స్థాయి అధికారి ఒకరు ఇదే పనిలో ఉన్నారు. ప్రతి మండలం, గ్రామం నుంచి నిధుల సేకరణ ప్రారంభించారు. పంచాయతీల నుంచి కూడా నిధులు అడుగుతున్నారు. ఎంత చేసినా పర్యటనకు నిధులు సమీకరించడం గండంగా మారింది. కొంత మంది అధికారులు వ్యక్తిగతంగా కూడా నిధులు అనధికారికంగా చెల్లించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
నాలుగు నెలల కిందట విద్యా దీవెనను బాపట్లలోనే జగన్ ప్రారంభించారు. అప్పటి బిల్లులే ఇంకా చెల్లించలేదు. చాలా మంది అధికారులు లక్షల్లో అప్పులు చేశారు.ఇప్పుడు నాలుగు నెలల్లోనే మళ్లీ సీఎం పర్యటన వచ్చేసింది. ఈ ఆర్థిక సమస్యల గురించి అధికారులే మీడియాకు చెబుతున్నారు. సీఎం పర్యటన కోసం కనీస ఏర్పాట్లు చేయడానికి సొమ్ములు ఉండటం లేదని.. తమపై సవారీ చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేర్లు చెప్పకుండా ఈ బాగోతం అంతా మీడియాకు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం పరువు పోతున్నట్లయింది.
ప్రభుత్వం ఇప్పటికీ ఈ నెల జీతాలు ఇవ్వలేదు. కనీసం ముఫ్ఫై శాతం మందికి జీతాలు, పెన్షన్లు అందలేదని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు సీఎం టూర్ ఖర్చులు కూడా లేనంత స్థితికి ఏపీ ప్రభుత్వం వెళ్లిపోయింది. ఇంత కంటే దారుణమైన పరిస్థితి ఏముంటుందన్న చర్చ జరుగుతోంది.