తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఊగిసలాటకు గురై చివరికి .. ఈడీ ఎదుట హాజరయ్యారు. మూడు రోజుల కిందట ఈడీ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది మొత్తం ఆదాయ వ్యయాలు..కేసుల వివరాలతో సహా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ కోణంలో ఉన్నాయని అనుమానించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..న్యాయసహాయం అందించారు. వరుసగా మూడు రోజుల పాటు ప్రగతి భవన్కు పిలిపించి మాట్లాడారు. న్యాయనిపుణులతో చర్చించారు.
సోమవారం ఉదయం కూడా.. రోహిత్ రెడ్డి ఈడీ ఆఫీసుకు బయలుదేరి.. తన వ్యక్తిగత సిబ్బందిని ఈడీ కార్యాలయానికి పంపించి.. నేరుగా ప్రగతి భవన్కు వెళ్లారు. అక్కడ్నుంచి.. తనకు తక్కువ సమయం ఇచ్చారని..మరో వారం రోజుల గడువు కావాలని ఈడీ అధికారులకు సమాచారం పంపించారు. కానీ ఈడీ అధికారులు మాత్రం కుదరదని తేల్చేశారు. హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈడీ నోటీసులు జారీ చేసినా హాజరు కాకపోతే.. తక్షణం అరెస్ట్ చేసినా..కోర్టుల నుంచి రక్షణ పొందలేని పరిస్థితులు ఉండటంతో మూడు గంటల తర్వాత ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు.
వ్యక్తిగత కారణాల వల్ల గడువు కావాలని ఈడీని కోరానని.. కానీ ఇవ్వలేదని.. అందుకే హాజరవుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. పైలట్ రోహిత్ రెడ్డి వ్యాపారాలు.. ఇతర వ్యవహారాలకు సంబంధించిన వివరాలన్నింటనీ ఈడీ దగ్గర పెట్టుకునే నోటీసులుజారీ చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ట్రాప్ చేసి మరీ బీజేపీని బద్నాం చేశారని రోహిత్ రెడ్డిపై బీజేపీ గుర్రుగా ఉంది. అయితే ఈడీ జారీ చేసిన నోటీసులు మాత్రం ఫలానా కేసు అని లేకపోవడంతో.. రోహిత్ రెడ్డి మరింత టెన్షన్ కు గురవుతున్నారు.
ఈడీ విచారణకు డుమ్మా కొడదామని చేసిన ప్రయత్నం ఫెయిల్ కావడంతో ఇప్పుడు రోహిత్ రెడ్డి.. ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఆయనకు సంబంధించిన లోటుపాట్లు బయటపడితే.. ఈడీ అంత తేలికగా వదిలి పెట్టే చాన్స్ లేదని భావిస్తున్నారు.