మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉంది బీజేపీ ప్రభుత్వాలే. అయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న ఓ వివాదం ఇప్పుడు రాజకీయాంశం అయిపోయింది. మూడు, నాలుగు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణం బీజేపీ.. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదాన్ని తెరపైకి తెచ్చేసింది. బెలగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి అనే సంఘం ఐదు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. అయితే అక్కడే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. మంట పెట్టడానికి ఇది సరిపోయింది.
అసెంబ్లీ సమావేశాలు బెళగావిలో ప్రారంభం అవడంతో ఇటు కర్ణాటకతో పాటు అటు మహారాష్ట్రలోనూ రచ్చ ప్రారంభమయింది. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు బెళగావి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఐదు వేల మంది కర్ణాటక పోలీసులు బెళగావిలో మోహరించారు. ఈ సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు..దశాబ్దాలుగా ఉంది. మరోవైపు సరిహద్దు వివాదంపై మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఎంపీ ధైర్యశీల్ సాంభాజిరావ్ మానే అనే ఎంపీ నేతృత్వంలో కమిటీవేసింది. ఆ కమిటీ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది.
రాజకీయ అవసరాల కోసం బీజేపీ ఇప్పుడు ఈ బెళగావి ఇష్యూను తెరపైకి తెచ్చి రాజకీయ మంటలు మండిస్తున్నారని..దేశంలో చిచ్చు పెడుతున్నారని రెండు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తోన్న మోడీ.. మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని వారంటున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా.. ప్రజల్ని సెంటిమెంటల్‌గా ప్రిపేర్ చేసేందుకు చేస్తున్న రాజకీయం కాబట్టి.. దీనికి మరింత ఆజ్యం పోస్తారు కానీ..తగ్గించరని గత పరిణామాలు నిరూపిస్తున్నాయి. కర్ణాటకలో ఎన్నికలయ్యే వరకూ బీజేపీ ఇలాంటివి చాలా చేసే అవకాశం ఉంది.