కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారు. బీజేపీలో కీలక నేతగా ఉన్నఆయనను ఆ పార్టీ పూర్తిగా దూరం పెట్టింది. ఎంత ప్రయత్నించినా ఆయనకు సహకారం అందడం లేదు.దీంతో కొత్త పార్టీ ఏర్పాటుకోసం గాలి జనార్దన్‌రెడ్డి ఎలక్షన్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీకి గాలి దరఖాస్తు పెట్టుకున్నారని.. కురుబ కులం నేతను అధ్యక్షుడిగా పెట్టి కొత్త పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారని కర్ణాటక రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
కర్నాటకలో అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్‌లోనూ కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఆ రెండు పార్టీల నుంచి నేతలను ఆహ్వానించి కొత్త పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లొచ్చనే వ్యూహంతో గాలి జనార్దన్‌రెడ్డి ఉన్నారు. కనీసం 25 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనేది గాలి టార్గెట్. ఆయనకు పది నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ బలం ఉంది. బళ్లారి, విజయనగరం, కొప్పల్, రాయచూర్, యాదగిరి, బీదర్ జిల్లాల్లో గాలికి భారీసంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు.
2013లో యడ్యూరప్ప బీజేపీని వీడి కర్ణాటక జనతా పార్టీని పెట్టినప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు శ్రీరాములు సహాయంతో బీఎస్ఆర్ కాంగ్రెస్‌ని స్థాపించినప్పుడు కమలంపార్టీ నష్టపోయింది. అయితే బీజేపీని తనదారికి తెచ్చుకునేందుకే గాలి జనార్దన్‌రెడ్డి మైండ్ గేమ్ మొదలుపెట్టారన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఇటీవల వైసీపీ కూడా.. గాలి అండ్ కో గురి పెట్టిన ప్రాంతంపైన గురి పెట్టినట్లుగా ప్రచారం జరిగింది.అయితే గాలి జనార్ధన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు.