తెలంగాణ కాంగ్రెస్లో ఏర్పడిన సంక్షోభాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. తిరుగుబాటు చేసిన సీనియర్లందర్నీ కలసికట్టుగా పార్టీలో చేర్చుకుని.. ఇక కాంగ్రెస్ పార్టీ లేదని.. బీజేపీలో విలీనమైపోయిందన్నట్లుగా చెప్పుకోవాలని తాపత్రయ పడుతోంది. ఇందు కోసం రాష్ట్ర బీజేపీ నేతలే ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే.. ఇంటలిజెన్స్ నిఘా ఉంటుందేమో కానీ.. కాంగ్రెస్ నేతలపై ప్రయోగిస్తే ఏమీ ఉండదు.అందుకే నేరుగా రాష్ట్ర నేతలే రంగంలోకి దిగారు.
సీనియర్ నేతల్లో కొంత మందితో సంప్రదింపులు జరిపినట్లుగా బీజేపీ వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. కలసి వచ్చే నేతల కోసం ప్రత్యేక విమానం మాట్లాడామని.. వారందర్నీ ఢిల్లీ తీసుకెళ్తామని ప్రచారం చేస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిపై ఒత్తిడి పెంచుతున్నారు. తొమ్మిది మంది సీనియర్ నేతల్లో కొంతమంది బీజేపీతో టచ్ లో ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం కూడా ఆ క్యాంప్ నుంచే వస్తోంది. ఈ కారణంగా కోవర్టులనే ముద్ర వారిపై పడుతోంది. ఇప్పుడు తిరుగుబాటు తర్వాత బీజేపీ వైపు నుంచి వస్తున్న లీకులతో వారు మరింతగా చిక్కుల్లో పడుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్లకు బీజేపీలో చేరే ఆలోచన ఉందో లేదో లేదో స్పష్టత లేదు. కానీ ఒకరిద్దరు మాత్రం బీజేపీతో టచ్ లో ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు. పామ్ హౌస్ ఫైల్స్ లో దామోదర రాజనర్సింహ పేరు వినిపించింది. ఇప్పుడు ఆయన కూడా ఆ అసంతృప్త వాదుల జాబితాలో ఉన్నారు. మిగిలిన వారిలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉన్నారు. ఆయనపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ఆయన సమీప బంధువు పాడి కౌశిక్ రెడ్డిని రాజకీయ వారసుడిగా భావించి టీఆర్ఎస్లోకి పంపేశారని చెబుతూ ఉంటారు.
కారణం ఏదైనా ఇప్పుడు బీజేపీ ప్రచారంతో… కాంగ్రెస్ సీనియర్ తిరుగుబాటు నేతలు.. మరింతగా ఇబ్బంది పడుతున్నారు. హైకమాండ్ వద్ద పలుకుబడి కోల్పోతున్నారు. తప్పనిసరిగా బీజేపీలో చేరే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని వారు ఎలా ఎదుర్కొంటారో మరి !