2022 లో డబ్బింగ్ సినిమాల హవా కనిపించింది. పాన్ ఇండియా సినిమాలుగా వచ్చిన కొన్ని చిత్రాలు తెలుగులో కూడా సత్తా చాటాయి. బాక్సాఫీసు వద్ద కాసుల పంట పండించాయి. ఒక్కసారి ఆ చిత్రాల విశేషాల్లోకి వెళితే..
కేజీఎఫ్ 2 :‘కేజీఎఫ్2’ మరోసారి సంచలనం రేపింది. కేజీఎఫ్ కి కొనసాగింపుగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించగా.. పూర్తి రన్లో రూ:900కోట్ల వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ పండితులు లెక్క గట్టారు. ఈ యేడాది అత్యధిక వసూళ్ళు సాధించిన డబ్బింగ్ చిత్రంగా నిలిచింది ‘కేజీఎఫ్2’.
విక్రమ్: యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ‘విక్రమ్’ తో తన విశ్వరూపం చూపించారు. చాలా కాలం తర్వాత కమల్ హాసన్ కి నిఖార్సయిన విజయం దక్కింది విక్రమ్ తో. లోకేష్ కనగారాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన విక్రమ్ పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి విక్రమ్ చాలా నచ్చింది. ఈ సినిమాని తెలుగులో విడుదల చేసిన శ్రేస్ట్ మూవీస్ లాభాలని చూసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ రూ.450కోట్లకు పైగా వసూళ్లు సాధించిదని ట్రేడ్ ఎనలిస్ట్ లు లెక్క తేల్చారు.
బ్రహ్మాస్త్రం: బాలీవుడ్లో హిట్టు మాట వినపడి చాలా కాలమైంది. సినిమాలన్నీ వరుసగా నిరాశ పరిచాయి. ఈ తరుణంలో భారీ అంచనాలతో బరిలోకి దిగింది ‘బ్రహ్మాస్త్రం’. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ , అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున వంటి స్టార్ మెరుపులు తోడవడం, దర్శక ధీరుడు రాజమౌళి స్వయంగా సమర్పిస్తుండటంతో తెలుగు ప్రేక్షకులని ఆకర్షించింది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో హిట్ అనే మాట వినిపించింది. తెలుగు లో కూడా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. విజువల్స్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులని అలరించాయి. ఈ యేడాది బాలీవుడ్ నుండి ఇక్కడ మెరిసిన ఏకైక చిత్రం బ్రహ్మాస్త్రం.
‘కాంతార’: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరో కన్నడ చిత్రంగా నిలిచింది ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్ లో ప్రేక్షకుడికి పూనకాలు తెప్పించింది. కన్నడ నేటివిటీలో రూపొందిన ఈ చిత్రాన్ని దేశం మొత్తం ప్రేమించడం విశేషంగా చెప్పాలి. క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. రూ.16కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.450కోట్ల వసూళ్లు దక్కించుకొని సత్తా చాటింది. ఇక రేటింగ్స్ లో అయితే కేజీఎఫ్ 2 ని కూడా బీట్ చేసింది.
సర్దార్: కార్తికి మరో విజయం సర్దార్ రూపంలో వచ్చింది. దీపావళికి వచ్చిన సర్దార్ తెలుగు ప్రేక్షకులకు నచ్చింది. కాన్సెప్ట్, ప్రజంటేషన్, కార్తి డబల్ యాక్షన్ సర్దార్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపావళి సినిమాలన్నిటి కంటే సర్దార్ కే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఘోస్ట్ ఫలితంతో నిరాశ చెందిన నాగార్జున సర్దార్ పంపిణీదారుడిగా విజయం సాధించారు.
చార్లి 777 : ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చార్లి 777 ప్రేక్షకులు, విమర్శకుల చేత జేజేలు అందుకుంది. మనసుని కదిలించే చిత్రంగా నిలిచింది. నటుడిగా రక్షిత్ శెట్టికి మంచి పేరు తెచ్చిపెట్టింది. బాక్సాఫీసు ఫలితం కూడా అదిరిపోయింది. రూ.20కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘చార్లి 777’.. రూ.105కోట్లకు పైగా రాబట్టి సత్తా చాటింది.
లవ్ టుడే : చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది లవ్ టుడే. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన ‘లవ్‌టుడే’ యూత్ ని ఆకర్షించింది. రూ.5కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా.. దాదాపు రూ.70కోట్లకు పైగా వసూళ్లు రాబటింది. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. కానీ ఇవ్వలేదు. చివరికి దిల్ రాజు తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. తెలుగు యువతకీ సినిమా నచ్చింది. లాభాలు తెచ్చింది.