విజయసాయిరెడ్డికి తప్పి పోయిన రాజ్యసభ ప్యానల్ చైర్మన్ పదవిని మళ్లీ దక్కించుకున్నారు. తన పరపతినంతా ఉపయోగించి పోయిన పరువు మళ్లీ తెచ్చుకోవాలన్నంత పట్టుదలతో ప్రయత్నించి చివరికి అనుకున్నది సాధించారు. విజయసాయిరెడ్డిని మళ్లీ ప్యానల్ వైస్ చైర్మన్ గా నియమిస్తూ.. ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యసభలో ప్రకటించారు. ఈ సారి విజయసాయిరెడ్డితో పాటు పీటీ ఉషను కూడా రాజ్యసభ ప్యానల్ చైర్మన్ గా ప్రకటించారు.
గతంలో తన పేరును తీసేయడంతో ఎగతాళి చేసిన వారంతా … మరోసారి చూసే ఉద్దేశంతో విజయగర్వంతో విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. సభ ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలా నావంతు కృషిచేస్తానని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితాను ప్రకటించారు. ముందుగా ఎనిమిదో పేరుగా విజయ సాయిరెడ్డి పేరు ఉంది. రాజ్యసభ కార్యాలయం నుంచి విజయసాయిరెడ్డికి సమాచారం కూడా వచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ వెబ్సైట్లో ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితాను పెట్టినప్పుడు ఎనిమిదో పేరుగా విజయసాయిరెడ్డిని ప్రస్తావించారు.
కానీ అధికారికంగా రాజ్యసభలో ఉపరాష్ట్రపతి ప్రకటించలేదు. విజయసాయి రెడ్డిని రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో మొదట చేర్చిన రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అనూహ్యంగా తొలగించారు. ప్యానల్ వైఎస్ చైర్మన్ జాబితాను పునర్వ్యవస్థీకరించామని చెప్పి ఏడు పేర్లే ప్రకటించారు. ఎనిమిదో పేరుగా ఉన్న విజయసాయిరెడ్డి పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఆయన పేరు తొలగించినట్లు అయింది. విజయసాయిరెడ్డి తీరుపై పలువురు ఫిర్యాదు చేయడంతోనే.. మొదట ఆయన పేరును తొలగించినట్లుగా ప్రచారం జరిగింది.