ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు పంపిణిని జగన్ బుధవారం ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా గతంలో జగన్ ల్యాప్ ట్యాప్లు పంపిణీ చేస్తామన్న హామీపై విస్తృతంగా చర్చల్లోకి వస్తోంది. నెల్లూరులో జరిగిన సభలో మోడల్ ల్యాప్ ట్యాప్ ను ప్రదర్శించిన జగన్.. పిల్లలకు అదే ఇస్తామని ప్రకటించారు. అయితే ఇది జరిగి రెండేళ్లు దాటిపోయింది. వాలంటీర్లు అమ్మఒడి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి.. ఆప్షన్స్ తీసుకున్నారు. వారంతా తమ పిల్లలకు ల్యాప్ ట్యాప్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇంత వరకూ ఎవరికీ ల్యాప్ ట్యాప్ ఇవ్వలేదు. అలాంటి చర్చను కూడా నిలిపివేశారు.
హఠాత్తుగా ప్రభుత్వం బైజూస్ తో ఒప్పందం చేసుకుని ట్యాబ్ లు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు జగన్ పంపిణీ ప్రారంభిస్తున్నారు. అసలు ఫార్మేటివ్ పరీక్షలు కూడా ముగిసిన సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ ట్యాబ్ లు ఎంత వరకూ ఉపయోగమో కానీ.. ఆర్భాటంగా పంపిణీ మాత్రం చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థులకు వచ్చే ప్రయోజనాల సంగతేమో కానీ.. ఏదో ఓ తాయిలం ఇచ్చామన్న ఆనందం.. విద్యార్థుల్లో…వారి కుటుంబాల్లో ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు
అయితే ఇప్పుడు ఈ ట్యాబ్ లు తీసుకుంటున్న వారికి.. అమ్మఒడి వస్తుందా రాదా అన్నది పెద్ద పజిల్ గా మారింది. ఎందుకంటే ల్యాప్ ట్యాబ్ బదులుగా ట్యాబ్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పడం లేదు. ఉచితంగానే ఇస్తున్నామని చెబుతోంది. అమ్మఒడి కూడా ఉచితమే. ప్రతీ ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడిని గత ఏడాది జూన్ కు మార్చింది. అంటే.. వచ్చే జూన్ లో అమ్మఒడి ఇస్తారు. ఆ సమయంలో ట్యాబ్ లు తీసుకున్న వారికి.. అమ్మఒడి పథకం నుంచి మినహాయిస్తూ.. నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు.