ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేయడంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. కొత్త ఐడియా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అందులో దానికి ఓనర్లు ఎవరూ లేరని.. అక్కడ ప్రభుత్వం కట్టడాలు నిర్మించబోతోందని చెబుతూ పోస్టర్లు పెట్టేస్తున్నారు. దీన్ని చూసి జనం ఉలిక్కి పడుతున్నారు. ఆ స్థలాల యజమానులు పరుగులు పెట్టుకుంటూ వెళ్తే.. ఖాళీ స్థలానికి పన్ను కట్టాలని.. పన్ను కట్టనందునే స్వాధీనం చేసుకుంటున్నామని చెబుతున్నారు.
ఈ పోస్టర్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. జగన్ అధికారంలోకి వచ్చాక.., ఇంటి పన్నులు.. విపరీతంగా పెంచారు. ఖాళీ స్థలాలపైనా పన్నులేశారు. వాటిని ప్రతీ ఏడాది పెంచుకుంటూ పోతున్నారు. కట్టకపోతే కబ్జా చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ పరిస్థితి చూసి చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు. ఎప్పుడో దశాబ్దాల కింద కొన్న స్థలాలకు..ఇప్పుడు రేటు పెరిగితే.. ఆ రేటు ప్రకారమే పన్ను చెల్లించాలని ప్రభుత్వం అంటోంది. వేలల్లో బిల్లులేస్తోంది. వాటిని చెల్లించలేక యజమానులు నానా అవస్థలు పడుతున్నారు.
ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వం చూపిస్తున్న ఈ అధికారం చూసి.. అందరికీ భయం పట్టుకుంటోంది. రేపో మాపో కాలనీల వారీగా ఎవరికీ తెలియకుండా బ్యాంకులకు తాకట్టు పెట్టినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఆయా ఖాళీ స్థలాలకు యాజమానులు ఎవరూ ముందుకు రాలేదని చెప్పడం ద్వారా.. ప్రభుత్వం వాటిని ఎప్పుడైనా కైవసం చేసుకునే ప్లాన్ లో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే తనఖా పెట్టేశారు. ఇక ప్రభుత్వానికి తాకట్టు పెట్టుకోవడానికి ఏమీ లేవు.. ఇక ప్రైవేటు ఆస్తులే కనిపిస్తున్నాయి… ఏం మాయాజాలం చేస్తున్నారో.. ఏం చేసేశారో… త్వరలో బయటపడుతుంది.