”ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఉద్యోగులంతా నిరసనలు చేస్తున్నారు. సదరు ప్రభుత్వం భారీ ప్రకటనలకు డబ్బులు ఖర్చు చేస్తోంది. మీకు ఆదాయం ఉంటే ఉచితాలు ఇవ్వొచ్చు. కానీ అప్పులు చేసి ఇవ్వడం కాదు” ఈ మాటలు వింటే ఎవరికైనా గుర్తు వచ్చేది ఏపీ ప్రభుత్వమే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతోంది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు..భారీగా ప్రకటనలకూ ఖర్చులు చేస్తోంది. అప్పులు చేసి మరీ ఉచితాలకు పంచి పెడుతోంది. అందుకే అందరూ నిర్మలా సీతారామన్ అన్నది ఏపీనేనని తేల్చారు.
నిజానికి నిర్మలా సీతారామన్ ఈ అంశాన్ని చెప్పాల్సిన పని లేదు. సభలో వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై స్పందించారు. కానీ ప్రత్యేకంగా ఏపీని గుర్తు చేసేలా.. చెబుతూ..అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పడం మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరించింది. ఏపీలో ఆదాయం పెరగకపోగా.. ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి. కట్టాల్సిన వడ్డీ భారం పెరిగిపోతోంది. ఓడీల మీదనే ప్రభుత్వం ఆధారపడుతోంది.
కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితిని ఆరు నెలల్లో పూర్తి చేస్తున్న ప్రభుత్వం.. కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా రుణాలు చేస్తోంది. వీటికి సంబంధించిన వివరాలు ఆర్బీఐకి పంపడం లేదు. దీంతో కొన్ని అదనపు రుణాలకు అనుమతి పొందుతున్నారు. కేంద్రానికి బ్యాంకుల నుంచి ప్రత్యేకంగా నివేదికలు అందుతున్నా.. వేల కోట్లు రుణాలిస్తున్నారని తెలుస్తున్నా.. నిరోధించడం లేదు. తమకు మద్దతుగా ఉంటున్న వైసీపీకి వారు మద్దతుగా ఉంటున్నారు. కానీ ఏపీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని చెప్పకనే చెబుతున్నారు. అంటే ఏపీ అలా అయిపోవడానికి వారి కూడా భాగం ఉందన్నట్లే.