రంగమార్తండ ప్రమోషన్లకు ఓ చేయి అందించారు చిరంజీవి. కృష్ణవంశీపై తనకున్న అపారమైన ప్రేమ, మమకారంతో… `నేనొక నటుడ్ని` అనే షాయరీని.. చిరంజీవి ఆలపించారు. ఇప్పుడు ఆ షాయరీ బయటకు వచ్చింది. వినీ వినంగానే.. చిరంజీవి గొంతు.. మనసులో ముద్రించుకుపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా… లక్ష్మీ భూపాల కాగితాలపై చేసిన పద విన్యాసం… సాహితీ ప్రియుల్ని మంత్రముగ్థుల్ని చేసింది. ఓ నటుడ్ని, రంగస్థల కళాకారుడ్ని 360 డిగ్రీల్లో ఆవిష్కరించిన షాయరీ ఇది.
నేనొక నటుడ్ని
చమ్కీల బట్టలేసుకొని
అట్ట కిరీటం పెట్టుకొని
చక్క కత్తి పట్టుకొని
కాగితం పూల వర్షంలో
కీలు గుర్రంపై స్వారీ చేసే
చక్రవర్తిని నేను.. అంటూ పిల్ల తిమ్మెరలా మొదలైన షాయరీ.. వానై.. వరదలై.. ఉరకలెత్తింది.
నాది కాని జీవితాలకు
జీవం పోసే.. నటుడ్ని అని ఎవరైనా రాసేస్తారేమో..? కానీ ఆ తరవాతి లైను..
నేను కాని పాత్రల కోసం వెదికే విటుడ్ని.. అని రాయడం దగ్గరే భూపాల ముద్ర కనిపిస్తుంది.
హరివిల్లుకి రెండు రంగులేసి
నవరసాలూ మీకందిస్తాను… అని రాయడం రచయితగా భూపాలని ఇంకో రెండు మెట్లు ఎక్కించిందనే చెప్పాలి.
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను..
యుగాలకి మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను.. అన్న చోట… కళాకారుడి జీవితం ధన్యమైపోతుంది.
ఉన్నదంతా నేను అనుకొనే అహం బ్రహ్మస్మిని..
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని… అన్నప్పుడు భావోద్వేగాల్ని కంచెలు దాటించేశాడు.
కళాకారుడెప్పుడూ.. రాబోయే కాలంలో కాబోయే చరిత్రే. అదే… ఈ షాయరీలో కనిపించింది.. వినిపించింది.. విధ్వంసంలా వికసించింది.
షాయరీ అనే ప్రక్రియ.. తెలుగు సినిమాకి తీసుకొచ్చిన కృష్ణవంశీకి ఓ నమస్కారం పెట్టుకొంటే.. దాన్ని.. తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన చిరంజీవి గొంతుకు ఇంకో షాష్టాంగ ప్రణామం చేసుకొంటే.. ఇళయరాజా రాగానికి వంద వీరతాళ్లు వేసుకొంటే.. భూపాల పద బంధానికి వేయిన్నొక్క చప్పట్లు కొట్టాల్సిందే. ఇది షాయరీ కాదు.. ఇక నుంచి.. కళాకారుల జాతీయ గీతం అనాలేమో..?