తెలుగుదేశం పార్టీ హయాంలో కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లుతాయని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో కాపులకు రిజర్వేషన్లు అమలవుతాయని కొంత మంది అనుకుంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లను జగన్ తీసేశారు. అధికారంలోకి రాగానే జగన్ చేసిన మొదట పని అదే. కాపులకు ఏదో విధంగా మేలు చేయాలన్న ఉద్దేశం లేకుండా.. వెంటనే.. ఆ రిజర్వేషన్లు సాధ్యం కావు..చెల్లవు అని చెప్పి.. రద్దు చేసేశారు. ఒక్క వైసీపీ కాపు నేత కూడా ఈ అంశంపై మాట్లాడలేదు.
గతంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ..టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ కేంద్రం అంగీకరించలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న నిబంధనల చూపింది. అయితే కేంద్రం మాత్రం ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం పది శాతం రిజర్వేషన్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో చంద్రబాబు చురుగ్గా ఆలోచించి.. ఏపీలో ఆ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమలు కోసం జీవో ఇచ్చారు. గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కిందనే ఈ సర్టిఫికెట్లు ఇస్తున్నారు.
అయితే ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే.. మొత్తం ప్రక్రియ పూర్తయిపోయినప్పటికీ.. ఈ రిజర్వేషన్లు సాధ్యం కావని.. చెల్లవని చెబుతూ జగన్ వాటిని రద్దు చేసేశారు. భారీ మెజార్టీతో గెలిచిన ఊపులో ఉన్న వైసీపీ నేతలు.. చివరికి కాపు నేతలు కూడా తమ కు దక్కని రిజర్వేషన్ల ఫలాన్ని తీసేస్తూంటే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారి పదవుల కోసం వారు తమ జాతిని మరో దశాబ్దం పాటు వెనక్కి నెట్టేసినట్లయింది.
ఇప్పటికైనా వైసీపీలోని కాపు నేతలు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి రాజకీయాలు చేయడం కాకుండా.. తమ ప్రజల ప్రయోజనాలు.. యువత ఉద్యోగావకాశాలు..విద్యావకాశాలు ఇతర విషయాల్లో మేలు జరిగేందుకు .. గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. లేకపోతే.. పదవుల కోసం సొంత వర్గానికి ఘోరం అన్యాయం చేసిన వాళ్లవుతారు.