దేశంలో రాజ్యాంగం, రూల్స్ ఏవీ అధికార పార్టీలకు పని చేయవు. తాము ఏం చేయాలనుకుంటే అవి చేసి.. రూల్స్ అనుగుణంగానే చేశామని ప్రకటించుకుంటాయి. అయితే విపక్షాలకు మాత్రం అవి చాలా కఠినంగా అమలవుతూ ఉంటాయి. దీనికి కరోనా సమయంలో జరిగిన అనేక పరిణామాలే నిదర్శనం. ఇప్పుడు మళ్లీ కొత్త వేరియంట్ కరోనా ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఇండియాలోనూ మూడు కేసులు నమోదయ్యాయని.. అప్పమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది.
అయితే వెంటనే కేంద్ర ఆరోగ్య మంత్రి దృష్టి రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై పడింది. ఆయన నేరుగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కరోనా ముంచుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి భారత్ జోడో యాత్ర ఆపేయాలని ఆయన కోరారు. ఆయన లేఖ చూసి.. అందరూ ఆశ్చర్యపోయారు. కరోనా విపక్ష పార్టీల కార్యక్రమాలకే వస్తుందా అని గొణుక్కున్నారు. కేంద్రంలో మాత్రమే కాదు.. రాష్ట్రాల్లోనూ అంతే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ఎక్కువ. ర్యాలీలతో అధికార పార్టీ నేతలు హోరెత్తించేస్తారు.. కానీ విపక్ష నేతలకు మాత్రం చాన్సే ఉండదు. పది మంది గుమికూడినా కేసులు పెట్టేస్తారు.
వచ్చేది ఎన్నికల కాలం. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఏపీలో చంద్రబాబు యాత్రలు.. లోకేష్ పాదయాత్రలు ప్రారంభం కానున్నయి. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇతర పార్టీలు ప్రజల్లోకి వెళ్తాయి., వీరందర్నీ కరోనా పేరుతో అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలు ఇంటింటికి పోయేందుకు ఏ ఒక్క అడ్డంకి రాదు. వారు ఇష్టారీతిన ర్యాలీలు నిర్వహిస్తారు. కరోనా కేసులు ఎంత పెరుగుతాయన్నదానిపై ప్రభుత్వాలకు బలం లభిస్తుంది.