చీరాల నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను.. ఆ నియోజకవర్గం నుంచి సీఎం జగన్ దూరం పంపేశారు. పర్చూరుకు నియోజకవర్గ ఇంచార్జుగా నియమించారు. ఇక పర్చూరు వైసీపీ నేతలంతా ఆమంచి చెప్పినట్లుగా వినాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఆయనను చాలా రోజుల నుంచి పర్చూరుకు పంపాలని అనుకుంటున్నారు. కానీ ఆమంచి మాత్రం ఆలోచిస్తూ వస్తున్నారు. చివరికి మరో దారి లేక అంగీకరించారు.
పర్చూరు నియోజకవర్గం సామాజికవర్గ పరంగా కూడా ఆమంచికి సెట్ కాదు. ఆ విషయం తెలుసు. అక్కడ తెలుగుదేశం పార్టీ జగన్ గాలిలోనూ గెలిచింది. ఏలూరు సాంబశివరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటారు. అందరికీ అందుబాటులో ఉంటారు. ఈ కారణంగానే కాకుండా.., సామాజికవర్గ పరంగా కూడా ఓటర్లు టీడీపీ వైపు ఉంటారు. అందుకే గత ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఆమంచిని ఆ స్థానానికి పంపిస్తున్నారు.
చీరాల నుంచి గత ఎన్నికల్లో టీడీపీ చేతిలో ఆమంచి ఓడిపోయారు. అప్పటి వరకూ ఆమంచి టీడీపీలో ఉన్నారు. చివరికి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ అధినేత.. కరణం బలరాంను చీరాల నుంచి బరిలోకి దింపింది. ఆయన విజయం సాధించారు. తర్వాత వైసీపీలో చేరారు. దీంతో చీరాల నుంచి తప్పనిసరిగా టిక్కెట్ ను కరణం లేదా.. ఆయన కుమారుడికి ఇవ్వాల్సి ఉంది. మరో వైపు చీరాలలో రెండు వర్గాలు.. పోరాడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే.. మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో.. ఆమంచిని చీరాల నుంచి పంపేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన పర్చూరు నుంచి రాజకీయ పోరాటం చేయనున్నారు.
అయితే జగన్ ఆమంచి రాజకీయ భవిష్యత్ ను సమాధి చేస్తున్నారని.. తెలివిగా ఆలోచించి.. ఆమంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. ఇప్పిటకే జగన్ మాట విని కోర్టుల్ని తిట్టిన కేసులో ఇరుక్కున్నారు. మున్ముందు ఈ కేసు ప్రభావం తీవ్రంగా ఉంటుదన్న ఆందోళన ఉంది. ఇప్పుడు రాజకీయంగా నిర్వీర్యమైతే ఎవరూ కాపాడరని వారంటున్నారు.