రుషికొండలో అక్రమ తవ్వకాల విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలకు అండగా కేంద్రం ఉంటోంది. దానికి రుజువు.. కేంద్ర అధికారులతో కమిటీ వేయమని హైకోర్టు ఆదేశిస్తే..రాష్ట్ర అధికారులతో సరి పెట్టడం. ఆ కమిటీని చూసి హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది…. కేంద్ర, కాష్ట్రాలు కుమ్మక్కయినట్లున్నాయి కదా అని అనుమానం వ్యక్తం చేసింది. తాజాగా ఆ కమిటీలో రాష్ట్ర అధికారులను తొలగించి .. కేవలం కేంద్ర పర్యావరణ, అటవీ అధికారులతో మాత్రమే కమిటీ వేసి.. రుషికొండ అక్రమ తవ్వకాలపై సర్వే జరిపి జనవరి 30వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీ నియమించాలని హైకోర్టు ఆదేశిస్తే.. కేంద్రం రాష్ట్ర అధికారులతో కమిటీ నియమించింది. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్రం ఏపీ ప్రభుత్వ అధికారుల నియామకాన్ని సమర్థిస్తూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంత సహకారం ఇస్తున్నప్పుడు… కమిటీలో కేంద్ర అధికారులు ఉంటే మాత్రం.. ఏపీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంటుంది ?
విశాఖలో సముద్రం ఒడ్డున ఉండే రుషికొండలో గతంలో టూరిజం రిసార్ట్స్ ఉండేవి. వాటిని కూల్చి వేసి.. కొండను మొత్తం తవ్వేశారు. 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారు. రుషికొండను బోడి గుండులా చేశారు. తీవ్ర విమర్శలు వచ్చినా తగ్గలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్క చేయలేదు. నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సజావుగా సర్వే నిర్వహిస్తే ప్రభుత్వ బండారం బయట పడుతుందని విపక్షాలు అంటున్నాయి. నిబంధనలకు ఉల్లంఘించినట్లుగా తేలితే.. అధికారులను జైలుకు పంపిస్తామని హైకోర్టు గతంలోనే హెచ్చరించింది. కేంద్ర అధికారులు నిజాయితీగా కొలుస్తారో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే ఇస్తారో వచ్చే నెలాఖరు వరకూ వెయిట్ చేయాల్సిందే.