ఏపీలోనూ వెలుగుదివ్వె కేసీఆరేనని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించుకుంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఉండాలి. అయితే బీఆర్ఎస్ ఈ ప్రకటన చేసిన సమయంలో … పార్టీ అధినేత కేసీఆర్ చుట్టుపక్క ఉన్న లీడర్లను చూస్తే మాత్రం..కాస్త అతి అయిందేమో అని అనిపించకమానదు. ఎందుకు ఏపీలో ఏ మాత్రం గుర్తింపు లేని వ్యక్తుల్ని.. వివిధ సంఘాల తరపున ప్రతినిధులుగా చూపించి వారితో కేసీఆర్ గ్రూప్ ఫోటో దిగి ఈ ప్రకటన చేశారు.
ప్రస్తుతానికి ఏపీలో బీఆర్ఎస్ రావాలని.. తాము చూసుకుంటామని కేసీఆర్ కు భరోసా ఇచ్చిన ప్రముఖుల్లో ఉన్న వారిలో పద్మశాలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు దివి కోటేశ్వరరావు, వలనుకొండ మల్లేశ్వరరావు, సామాజికవేత్త తోటకూర కోటేశ్వరరావు, స్వర్ణకారుల సంఘం నేత నాగేశ్వరరావు, బీసీ సంఘం నేత రామనాథం అంజన్రావు వంటి వారు ఉన్నట్లుగా బీఆర్ఎస్ ప్రకటించారు. కేసీఆర్ వీరిని ప్రగతి భవన్ కు ఆహ్వానించి.. మంతనాలు జరిపారు., వీరంతా.. ఏపీకి బీఆర్ఎస్ మాత్రమే వెలుగు దివ్వె అని చెప్పారు. దానికి కేసీఆర్ సంతోషించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత ఏపీలో ఓ రేంజ్ లో ఆ పార్టీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం చేశారు. కేసీఆర్ సన్నిహితులు… టీడీపీ నేతల్ని తమ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా చెప్పుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఇంచార్జ్ గా పెట్టారని సంక్రాంతి తర్వాత బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా చెప్పుకున్నారు. తీరా చూస్తే… ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ప్రారంభ కార్యక్రమంలోనూ ఏపీ నుంచి ఎవరూ పాల్గొనలేదు. కనీసం ఫోటోలు దిగేందుకు కూడా ఎవరూ వెళ్లలేదు.
సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ కిసాన్ సెల్ ను ఏపీలోనూ ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ కిసాన్ సెల్ ను ఎవరు లీడ్ చేస్తారో ఇంత వరకూ కేసీఆర్ ను కలిసినట్లుగా కూడా చెప్పుకోలేదు. ప్రస్తుతం ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ అంచనాల కన్నా దిగువనే ఉంది. ముందు ముందు కేసీఆర్ మ్యాజిక్ చేస్తారేమో తెలియదు కానీ..ఇప్పుడైతే.. ఎవరో పరిచయస్తుల్ని తీసుకొచ్చి ప్రకటనలు చేస్తున్నట్లుగానే ఉంది.