ఫామ్ హౌస్ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతికి వెళ్లకుండా కేసీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమవుతున్నాయి. సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ ఇంకా హైకోర్టులో విచారణలో ఉండగానే.. ఈడీ రంగంలోకి దిగింది. ఈడీకి ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. దీంతో గుట్టుగా విచారణ ప్రారంభించేసింది. ఎమ్మెల్యేలకు ఇస్తామని చెప్పిన వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో కనిపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారం మొత్తం నందకుమార్ చుట్టూ తిరుగుతోంది. ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
పైలెట్ రోహిత్‌రెడ్డి బిజినెస్ ల గురించి మొత్తం బయటకు తీసింది. నందకుమార్ వ్యాపార సంస్థల్లో హోటల్స్ విభాగంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆవుల అభిషేక్ అనే వ్యక్తి అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరిని ఈడీ పిలిపించి ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసినట్లుగా చెబుతున్న డబ్బు ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలు్సతోంది. నందుకుమార్ విచారణ కోరుతూ నాంపల్లిలోని 3వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేశారు. ఫామ్‌హౌస్ కేసులోనే విచారించనున్నట్లుగా చెప్పారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న డబ్బు, నిందితుడు నందుకుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలిస్తున్నది. ఇద్దరికీ గతంలోనే వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిసింది. నందుకుమార్‌కు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే ఆధారాలు సేకరించింది. మొత్తంగా చూస్తే..ఈడీ ఈ కేసు విషయంలో.. కేవలం డబ్బు లావాదేవీల గురించి విచారణ చేసినా అంతిమంగా అసలు కుట్ర ఏమిటో బయట పెట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.