కాంగ్రెస్ పార్టీలో జూనియర్లు, సీనియర్లు అంటూ ఎవరూ ఉండరని తెలంగాణ వ్యవహారాలను చక్కబెట్టడానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అసలు సమస్యకు కారణం అయిన సీనియర్లకు ఈ తరహాలో ఆయన షాక్ ఇచ్చినట్లుగా స్పష్టమయింది. పార్టీలో జూనియర్ నేత అయిన రేవంత్ కింద తాము పని చేయడం ఏమిటని సీనియర్ నేతలు రచ్చ చేస్తున్నారు. తమ కు గౌరవం ఉండటం లేదని అంటున్నారు. బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు వారిని బుజ్జగించడానికన్నట్లుగా వచ్చిన దిగ్విజయ్.. అసలు అందరూ సమానమేనని.. సీనియర్లు అనే కాన్సెప్ట్ ఉండదని తేల్చేశారు. దీంతో సీనియర్లకు ఇక పార్టీలో ఎలాంటి మార్పులు ఉండవని.. ఉండే ఉండాలి లేకపోతే లేదని చెప్పినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దిగ్విజయ్ సింగ్ అందరితోనూ సమావేశం అయ్యారు. సీనియర్ నేతలందర్నీ కలిశారు. చివరికి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డినీ కలిశారు. అందరి మాటలు విన్నారు. తాను చెప్పాలనుకున్నది చెప్పారు.
అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీలో సమస్యలు ఉంటే హైకమాండ్ దృష్టికి తేవాలి కానీ.,. మీడియా ఎదుట మాట్లాడటం.. పార్టీ పరువును బజారున పడేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇక తమకే ఏదో బుజ్జగిస్తారని.. రేవంత్ కు సుద్దులు చెబుతారని.. ఇంచార్జ్ ఠాగూర్ ను మారుస్తారని ఆశపడుతూ వచ్చిన సీనియర్లకు ఈ పరిణామంతో షాక్ తగిలినట్లయింది. ఇక వారు తదుపరి నిర్ణయం ఏం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.