ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. మీ బిడ్డకూ.. చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఎన్నికలు్ంటూ మాట్లాడుతున్నారు. ఇంత కాలం అవ్వాతాతలు అని.. మామ అని.. ఇలా రకరకాలుగా వరుసలు కలుపుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు మీ బిడ్డనంటూ జాలి చూపించమన్నట్లుగా అడుగుతున్నారు. కడప జిల్లాలో కొన్ని పనులకు శంకుస్థాపన చేసి బహిరంగసభలో ప్రసంగించారు. ఈ ప్రసంగం మొత్తం ఎన్నికల ప్రచారం లాగానే సాగింది. మిమ్మల్ని, దేవుడ్నే నమ్ముకున్నానని..తనను ఆదరించాలని కోరుతున్నారు.
ఎప్పట్లాగే చంద్రబాబుపై అనేక రకాల విమర్శలు చేశారు .చంద్రబాబు ఖమ్మంలో సభ పెట్టిన దాన్నీ పరోక్షంగా ప్రస్తావించుకున్నారు. చంద్రబాబుకు ఈరాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం ఉందని.. తనకు మాత్రం ఈ రాష్ట్రమే ముఖ్యమన్నట్లుగా చెప్పుకొచ్చారు. తాను ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఉన్నానన్నారు. అందరికీ మేలు చేశానని.. తనను ఆదరించాలని కోరారు. అందరికీ మేలు చేస్తే ఇలా సెంటిమెంట్లు పండించాల్సిన అవసరం ఏముంది.. వారే ఓట్లు వేయరా అని సహజంగానే డౌట్ వస్తుంది. తాను ఏపీ సీఎంఅనే భావనతో కాకుండా.. కడప జిల్లా వ్యక్తినన్నట్లుగా చెప్పుకోవడానికి జగన్ పరోక్షంగా ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది.
స్టీల్ ప్లాంట్ విషయంలోనూ జగన్ అదే మాట చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజు శంకుస్థాపన చేసి మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మూడేళ్ల తర్వాత కడపలోనే బహిరంగసభలో మాట్లాడి మళ్లీ అదే మాట చెప్పారు. జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయని వచెప్పుకొచ్చారు. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ. 8800 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిలో రాను రాను కాన్ఫిడెన్స్ తగ్గిపోతోంది. ప్రజల్ని కలవకుండా పరదాలు కట్టుకుని పర్యటనలు చేస్తూ… మీ బిడ్డనని.. ప్రజల్లో సెంటిమెంట్ పుట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.