కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని.. రూ నలభై వేల కోట్లు నష్టపోయిందని.. దీన్ని అసెంబ్లీ వేదికగా వారం రోజుల పాటు చర్చించి.. ప్రజల ముందు పెట్టాలని కేసీఆర్ గత నెల చివరి వారంలో నిర్ణయించారు. డిసెంబర్లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే డిసెంబర్ అయిపోతోంది కానీ..కేసీఆర్ మళ్లీ అసెంబ్లీ సమావేశాల ఆలోచన చేయలేదు.
బీఆర్ఎస్ ఆవిర్భావం.. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సోవం కోసం నాలుగు రోజులు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఖాళీగానే ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల గురించి సీరియస్గా తీసుకోలేదు. ఈ లోపు క్రిస్మస్ వచ్చేసింది. మరోసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. క్రిస్మస్ తర్వాతి రోజు ఢిల్లీ వెళ్తారని.. కొత్త ఏడాదిలోనే తిరిగి వస్తారని అంటున్నారు. అంటే అసెంబ్లీ సమావేశాలు లేనట్లే.
ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాల కన్నా అసెంబ్లీ సమావేశాల వల్లనే బీజేపీపై ఎక్కువ పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది.. ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకనో నిర్ణయం తీసుకున్నంత ఆవేశంగా అమలు చేయలేకపోతున్నారు. తెలంగాణ సర్కార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం రుణాలు పుట్టనివ్వడం లేదు. కేంద్రం తీరుపై ఒక్కో సారి ఆగ్రహం తెచ్చుకున్నా..కేసీఆర్ వెనక్కి తగ్గుతున్నారు. జనవరిలో పెడితే పదో తేదీలోపు అసెంబ్లీ ముగించాల్సి ఉంటుంది. అంటే తొలి వారంలోనే ప్రారంభించాలి. లేకపోతే సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. మరి కేసీఆర్ ఒక్క సారే బడ్జెట్ సమావేశాలకు వెళ్తారో. ప్రత్యేక సమావేశం ఉంటుందో బీఆర్ఎస్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి.