ఏపీలో పేదలు చనిపోవడం కూడా ఖర్చుతో కూడిన భారంగా మారిపోయిది. శ్మశానాల్లో రూ. ఐదు వేల కనీస చార్జీగా నిర్ణయిస్తున్నారు. మునిసిపాలిటీలన్నింటిలో ఇప్పుడు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో కుటుబంంలో ఎవరైనా చనిపోతే నిరుపేదలకు పెనుభారంగా మారుతోంది. ఏలూరు కార్పొరేషన్లో తాజాగా ఈ ధర నిర్ణయిస్తూ తీర్మానం చేశారు. ఇప్పటికే చాలా చోట్ల మూడు నుంచి మూడున్నర వేలు వసూలు చేస్తున్నారు. ఏలూరు బాటలోనే త్వరలోనే అన్ని చోట్లా ఇలాగే వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎవరైనా చనిపోతే.. ఆ కుటుంబం పట్ల అందరూ సానుభూతి చూపిస్తారు. పేద కుటుబంం అయితే.. ఆ కుటుంబ ఖర్చులను భరించడానికి ప్రయత్నిస్తారు. పేద కుటుంబంలో చావులు ఎన్ని ఆర్థిక కష్టాలు తీసుకు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ప్రభుత్వం ప్రతీ పేద కుటుంబానికి చంద్రన్న బీమా అమలు చేసింది. చనిపోయారని తెలిసిన వెంటనే.. ఐదు వేలు ఇచ్చేది. తర్వాత పెద్ద దినం అయ్యేలోపు.. మిగతా మొత్తం అందించేది. దీంతో వారికి కొంత ఊరట లభించేది. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాల్ని తీసేసింది. దీంతో కుటుంబసభ్యుల మరణం సంభవించిన కుటుంబాలు నరకం అనుభవిస్తున్నాయి. ఇప్పుడు అంత్యక్రియలకే ఐదు వేలు కట్టాల్సిన ప రిస్థితి ఏర్పడుతోంది.
నిజానికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సామాజిక బాధ్యత ఉంటుంది. ప్రజల నుంచి వారు వసూలు చేస్తున్న పన్నులకు ఖచ్చితంగా కొన్ని ఉచిత సేవలు అందించాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించడం కూడా ఒకటి. కానీ ఆదాయపు మత్తులో పడిన పురపాలక సంఘాలు బాధల్లో ఉన్న వారిని మరింత వేధించి అయినా సరే డబ్బులు వసూలు చేయడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని..ఇంత దారుణమైన పాలన చూడలేదని.. బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నిజానిక ఎవరైనా పేదలు చనిపోతే.. వారికి అన్ని విధాలుగా సాయం చేసి.. అంత్యక్రియలు నిర్వహించడానికి కొన్ని స్వచ్చంద సంస్థలు పని చేస్తూ ఉంటాయి. కరోనా సమయంలో వీరు చేసిన సేవలు ఎంతో మందికి ఊరటనిచ్చాయి. ఇక ముందు ఇలాంటి వారు సేవలు చేయాలన్నా… డబ్బులు కట్టి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.